ఆదివారం ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

2 Oct, 2022 01:59 IST|Sakshi

సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న మంత్రులు 

33 జిల్లాల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులకూ ఆహ్వానం 

5న జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో ఉత్కంఠ 

కొత్త పార్టీని స్వాగతిస్తూ భారీ వేడుకలు.. ఊరూరా ర్యాలీలు 

దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, కటౌట్ల ఏర్పాటు 

రాష్ట్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న పలువురు జాతీయ నేతలు 

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ఊరూవాడా సంబురాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. అటు దసరా పండుగ, ఇటు కొత్త పార్టీ నేపథ్యంలో భారీ ఎత్తున ర్యాలీలు, సమావేశాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయనున్నారు.

దీనికి సంబంధించి టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రగతిభవన్‌లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులతోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులనూ ఈ సమావేశానికి రావాల్సిందిగా శనివారం ఆహ్వానం పంపారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం గాంధీ ఆస్పత్రి ఎదుట గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ప్రగతిభవన్‌కు చేరుకుంటారు. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఆ తర్వాత సమావేశం ప్రారంభం కానుంది. అయితే సమావేశ ఎజెండా ఏమిటనే దానిపై మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. 

ఊరూరా భారీగా సంబురాల కోసం 
జాతీయ పార్టీ ఏర్పాటుపై ఈ నెల 5న దసరా రోజున పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ వేదికగా సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేయనున్నారు. ఆ కొత్త పార్టీ ప్రకటన, ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్‌ కీలక సంకేతాలు, సూచనలు ఇవ్వనున్నట్టు తెలిసింది. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన వెంటనే దేశవ్యాప్తంగా కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ప్రకటనలు వెలువడేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో కొత్త జాతీయ పార్టీని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. 

మంత్రులు, జిల్లా అధ్యక్షులకు బాధ్యతలు 
కొత్త పార్టీ ప్రకటనకు మరో మూడు రోజులు సమయం ఉన్నందున ఊరూరా సంబురాలు నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ఆదివారం జరిగే భేటీలో కేసీఆర్‌ దిశానిర్దేశం చేసే అవకాశముంది. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో పండుగ వాతావరణాన్ని ఇనుమడించేలా కొత్త పార్టీని స్వాగతిస్తూ సంబురాలు ఉండాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దసరా రోజున పార్టీ ఏర్పాటు ప్రకటన వెలువడిన వెంటనే ఊరూరా ర్యాలీలు, ఊరేగింపులు, ముఖ్య కూడళ్ల అలంకరణ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లు, సమన్వయం చేసే బాధ్యతను మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులకు అప్పగించనున్నట్టు సమాచారం. ఈ అంశాలన్నింటికీ సంబంధించి ఆదివారం జరిగే భేటీలో సీఎం కేసీఆర్‌ సూచనలు చేయనున్నట్టు తెలిసింది. 

హైదరాబాద్‌కు జాతీయ నేతలు 
కొత్త పార్టీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖ నేతలను కేసీఆర్‌ ఆహ్వానించారు. కేసీఆర్‌ నుంచి ఆహ్వానాలు అందుకున్న వారిలో ఇప్పటివరకు బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్‌ యాదవ్‌ (ఉత్తరప్రదేశ్‌), కుమారస్వామి (కర్ణాటక), శంకర్‌సింగ్‌ వాఘేలా (గుజరాత్‌) తమ రాకను ఖరారు చేశారు. 5న ఉదయం వారు ప్రగతిభవన్‌కు చేరుకుని.. అదే రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో జరిగే టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ భేటీలో వారు సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొననున్నారు. మరికొందరు నేతలు కూడా వచ్చే అవకాశం ఉందని.. వారి పర్యటన ఒకట్రెండు రోజుల్లో ఖరారు అవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

మరిన్ని వార్తలు