ఎమ్మెల్యేల కొనుగోలు.. ‘సిట్‌’లో రెమా రాజేశ్వరి.. సీవీ ఆనంద్‌ తర్వాత ఆమెనే!

10 Nov, 2022 18:50 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ కోసం నియమించిన ప్రత్యేక విచారణ బృందం (సిట్‌)లో ఆమెకు చోటు కల్పించింది. రాజకీయ ప్రమేయమున్న ఈ కీలక కేసులో జిల్లా ఎస్పీని నియమించేందుకు గాను అనేక అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

గతంలో పలు కీలక కేసులను విచారించిన అనుభవంతో పాటు ఆయా కేసుల్లో పక్కా సాక్ష్యాలు సేకరించే నైపుణ్యం ఉన్న అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న రెమా రాజేశ్వరికి ఈ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ప్రభుత్వం నియమించిన ఏడుగురు పోలీసు అధికారుల్లో సిట్‌కు నేతృత్వం వహించనున్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తర్వాత సీనియర్‌ అధికారిణి మన ఎస్పీనే. 

ట్రాక్‌ రికార్డు అదుర్స్‌..
నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసు రాజకీయంగా చాలా కీలకమైంది. ఈ కేసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది. అలాంటి కీలకమైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌లో మన ఎస్పీకి చోటు దక్కేందుకు గతంలో ఆమెకున్న ట్రాక్‌ రికార్డే కారణమనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. 2014లో పెదవూర మండలం ఏనెమీదితండాలో 12 మంది గిరిజన బాలికలపై జరిగిన లైంగిక దాడి కేసు విచారణలో ఎస్పీ రెమా రాజేశ్వరి కీలకంగా వ్యవహరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో జిల్లా అదనపు ఎస్పీగా ఉన్న ఆమె పకడ్బందీగా కేసును ముందుకు నడిపించి సాక్ష్యాధారాలతో సహా నిరూపించి నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషిచేశారు.

ఆమె మహబూబ్‌నగర్‌ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఎరుకల శ్రీను అనే సీరియల్‌ కిల్లర్‌ కేసును కూడా ఛేదించారు. 17 మందిని పొట్టనబెట్టుకున్న నరహంతకుడిని కటకటాల పాలుజేసి సంచలన కేసు దర్యాప్తునకు నేతృత్వం వహించారు. అదే జిల్లాలో 12 మందిని హత్య చేసిన మరో సీరియల్‌ కిల్లర్‌ యూసుఫ్‌ ఆటకట్టించింది కూడా రెమా రాజేశ్వరీనే. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డీసీపీగా పనిచేసినప్పుడు కూడా కీలక కేసుల దర్యాప్తులో తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కీలకమైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ బాధ్యతలు అప్పజెప్పింది.  

మరిన్ని వార్తలు