యువజన సంఘాల మహాధర్నా ఉద్రిక్తం

14 Nov, 2022 02:10 IST|Sakshi
ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకుంటున్న ఆందోళనకారులు 

గుండ్లపల్లి–గన్నేరువరం డబుల్‌ రోడ్డు కోసం సంఘాల ఆందోళన

మద్దతు తెలిపిన అఖిలపక్షం.. పోలీసుల లాఠీచార్జి 

ఎమ్మెల్యే రసమయి వాహనంపై చెప్పుల దాడి

దాడికి నిరసనగా ఎల్‌ఎండీ ఠాణాను ముట్టడించిన టీఆర్‌ఎస్‌ 

గన్నేరువరం (మానకొండూర్‌)/తిమ్మాపూర్‌: డబుల్‌ రోడ్డు నిర్మాణం కోసం కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఆదివారం యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. గుండ్లపల్లి నుంచి వయా గన్నేరువరం మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణం కోసం యువజన సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి.

పోలీసులు గుండ్లపల్లికి చేరుకోవడంతో ఆందోళనకారులు రూటు మార్చి గుండ్లపల్లి దాబా వద్ద రాజీవ్‌ రహదారిపై ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని కోరినా.. ఆందోళనకారులు పట్టించుకోకపోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. యువజన సంఘాల నాయకుడు అల్లూరి శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ విషయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ విఫలమయ్యారని విమర్శించారు.

అక్కడికి చేరుకున్న కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే రసమయి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసమర్థత ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నించారు. అదే సమయంలో కరీంనగర్‌ నుంచి బెజ్జంకి వైపు వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ వాహనంపై ఆందోళనకారులు చెప్పులు విసురుతూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం కవ్వంపల్లి, శ్రీనాథ్‌రెడ్డి, యువజన సంఘాల సభ్యులను అదుపులోకి తీసుకుని తిమ్మాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు శంకర్, అనంతరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొమ్మెర రవీందర్‌రెడ్డి, బామండ్ల రవీందర్, నాయకులు పాల్గొన్నారు.  

ఎల్‌ఎండీ ఠాణాను ముట్టడించిన టీఆర్‌ఎస్‌ 
రసమయి బాలకిషన్‌పై దాడికి నిరసనగా టీఆర్‌ఎస్‌ నాయకులు భారీగా ఎల్‌ఎండీ ఠాణాకు చేరుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను కఠినంగా శిక్షించాలని స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న సీపీ, పోలీస్‌ అధికారులు టీఆర్‌ఎస్‌ నాయకులతో మాట్లాడి ఆందోళన విరమించాలని సూచించారు. గన్నేరువరంలో తనపై జరిగిన దాడి గురించి గన్నేరువరం జెడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి.. రసమయి బాలకిషన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి ఎల్‌ఎండీ పోలీస్‌ స్టేషన్‌లో కాంగ్రెస్, బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశారు.  

చిల్లర రాజకీయాలు మానుకోవాలి: రసమయి 
కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ హెచ్చరించారు. వాహనంపై దాడి అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర్నా అంటే దాడులు చేయడమేనా? అని ప్రశ్నించారు. 40 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, 8 ఏళ్ల పాలనలో బీజేపీ ఏం చేసిందని నిలదీశారు. డబుల్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ప్రధాని మోదీ ఉమ్మడి జిల్లాకు వచ్చిన సమయంలో రహదారులకు నిధులు ఎందుకు అడగలేదని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు