నేనేమైనా వృద్ధుడినా.. సీటు నాదే.. గెలుపు నాదే..

8 Aug, 2022 14:15 IST|Sakshi

జయశంకర్‌ భూపాలపల్లి: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. నేనే గెలుస్తా.. సీటు నాదే.. గెలుపు నాదే.. ఇక చర్చలు ఆపండి.. నేనేమైనా వృద్ధుడినా, మంచి ఆరోగ్యంగా ఉన్నాను. చక్కగా ప్రజలకు సేవలు అందించగలిగే సామర్థ్యం, ఓపిక ఉంది.. నన్ను ఒక్కడిని గెలిపిస్తే.. నేను, నా సతీమణితో పాటు జీఎంఆర్‌ఎం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నాం అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నంటిని నెరవేరుస్తున్నానని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదేనని అన్నారు. త్వరలోనే గోరికొత్తపల్లి మండలంగా ఏర్పడబోతుందని తెలిపారు. జిల్లాకేంద్రంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.168కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ఇందుకు జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. వంద పడకల ఆస్పత్రిలో 71పోస్టుల మంజూరుకి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అంగీకరించారని, త్వరలోనే నియామకాలు జరుగుతాయని తెలిపారు. భూపాలపల్లిని ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

చెల్పూరు నుంచి భూపాలపల్లి పట్టణంలోని బాంబులగడ్డ వరకు జాతీయ రహదారి విస్తరణ, సైడ్‌ డ్రెయినేజీ నిర్మాణ పనులకు రూ.80 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.15కోట్లతో చేపట్టిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవన నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయని అన్నారు. వర్షాలు తగ్గాక భూపాలపల్లికి వస్తానని సీఎం కేసీఆర్‌ చెప్పాడని తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన సుమారు రూ.3కోట్లతో శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మాణం చేపట్టగా కొందరు కావాలని ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 

దేవుడి గుడి నిర్మించడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణిసిద్ధు, వైస్‌చైర్మన్‌ కొత్త హరిబాబు, జంగేడు పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌కుమార్, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు కొక్కుల తిరుపతి, నూనె రాజు, క్యాతరాజు సాంబమూర్తి, ముంజాల రవీందర్, పిల్లలమర్రి నారాయణ, శిరుప అనిల్, మాడ హరీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు