రోహిత్‌రెడ్డి ఈడీ విచారణలో కొత్త ట్విస్ట్‌..

22 Dec, 2022 08:45 IST|Sakshi

7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ గుట్కా కేసు లావాదేవీల్లోనే నోటీసులు 

నందుకుమార్, అభిషేక్‌ ఆవాల, రోహిత్‌రెడ్డి సోదరుడి మధ్య రూ.7.75 కోట్ల లావాదేవీలు 

ఈ కేసులోని ఆర్థిక వ్యవహారాలపైనే ఎక్కువగా ప్రశ్నించిన అధికారులు 

తాజాగా అభిషేక్కు నోటీసులు జారీచేసిన ఈడీ

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి – ఈడీ కేసులో కొత్త ట్విస్ట్‌. ఎమ్మెల్యేలకు ఎర కేసులోనే తనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారించిందని రోహిత్‌రెడ్డి చెప్పిన 24 గంటల్లోనే ఈడీ అధికారులు ‘7 హిల్స్‌ మాణిక్‌చంద్‌’ పాన్‌ మసాలా యజమాని అభిషేక్‌ ఆవాలకు నోటీసులు జారీచేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుమిత్‌గోయల్‌ స్పష్టం చేశారు. 2015 నుంచి అన్ని బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లు, ఏయే సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నారు, కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందుకుమార్‌ తనను రూ.1.75 కోట్ల మేరకు మోసం చేశారంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అభిషేక్‌ ఈనెల రెండోవారంలో ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. అభిషేక్, రోహిత్‌రెడ్డి సోదరుడి మధ్య రూ.7.75 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ లావాదేవీలు ఏ సందర్భంగా జరిగాయి? ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు? రోహిత్‌రెడ్డితో ఉన్న సంబంధాలపై పూర్తిస్థాయిలో కూపీ లాగేందుకు అభిషేక్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

రెండురోజులపాటు ఈడీ విచారణను ఎదుర్కొన్న రోహిత్‌రెడ్డి తనను ఎమ్మెల్యేల ఎర కేసులోనే విచారించారని, ఈ కేసులో తాను ఫిర్యాదుదారుడిగా ఉన్నా.. దోషులను వదిలిపెట్టి తనను విచారణకు పిలవడం ఏమిటో అర్థం కావడం లేదని మీడియాతో వాపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ అధికారులు మాత్రం ‘7 హిల్స్‌ మాణిక్‌చంద్‌’ పాన్‌ మసాలాకు సంబంధించిన లావాదేవీలపై రోహిత్‌రెడ్డిని ఎక్కువగా ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పాన్‌మసాలా కేసులోనే రోహిత్‌రెడ్డిని విచారించినట్లు స్పష్టమవుతోంది. 

2015లోనే సొంత బ్రాండ్‌పై... 
మాణిక్‌చంద్‌ గుట్కాకు హైదరాబాద్‌ కేంద్రంగా ప్రధాన పంపిణీదారుగా ఉన్న అభిషేక్‌ ఆవాల 2015లో సొంత బ్రాండ్‌తో పాన్‌ మసాలా తయారీని ప్రారంభించారు. బీబీనగర్‌ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ఓ యూనిట్‌ స్థాపించి ‘7 హిల్స్‌ మాణిక్‌చంద్‌’ పేరుతో పాన్‌ మసాల, జర్దా తదితరాలను ఉత్పత్తి చేసి విక్రయించడం మొదలెట్టాడు. ఆపై గుజరాత్‌ నుంచి గుట్కా తెచ్చి అక్రమంగా అమ్మకాలు సాగించినట్లు సమాచారం. ఆ దందాలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందుకుమార్‌ కూడా కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది.

అభిషేక్‌, నందుకుమార్‌ సంయుక్తంగా వే ఇండియా టుబాకో ప్రైవేట్‌ లిమిటెడ్, 7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, 7 హిల్స్‌ మార్కెటర్స్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, డబ్ల్యూ3 హాస్పిటాలిటీస్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్నారు. డబ్ల్యూ3 సంస్థలో రాజేశ్వర్‌రావు కల్వకుంట్ల కూడా ఓ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థను ముగ్గురూ కలిసి 2015 నవంబర్‌ 6న ఏర్పాటు చేశారు. ‘7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ పాన్‌ మసాలా’ ఉత్పత్తులకు సంబ«ంధించిన ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్స్, సీ అండ్‌ ఎఫ్‌ ఏజెన్సీలు ఇస్తానంటూ అభిõÙక్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒడిశా, పశి్చమబెంగాల్‌లోని అనేక మందిని మోసం చేశారన్న అభియోగాలున్నాయి. ఈ వ్యవహారాల్లోనూ నందుకుమార్‌ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

అయ్యప్ప దీక్షను విరమించిన రోహిత్‌రెడ్డి 
తాండూరు: వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అర్ధాంతరంగా అయ్యప్ప దీక్ష విరమించారు. ఆయన అన్న కుమారుడు శశాంక్‌రెడ్డి మంగళవారం అర్ధరాత్రి బషీరాబాద్‌ మండలం ఇందర్‌చెడ్‌ గ్రామంలో మృతిచెందారు. దీంతో అయ్యప్ప దీక్షలో కొనసాగడం మంచిది కాదని, విరమించినట్లు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తెలిపారు.
చదవండి: 'ఫోన్ 10 సార్లు ఎందుకు మార్చారు కవిత? వాళ్ల ఇంటికి ఎందుకెళ్లారు?'

మరిన్ని వార్తలు