అస్తమించిన పోరుబిడ్డ

7 Aug, 2020 07:33 IST|Sakshi
దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి అంతిమయాత్ర, (ఇన్‌సెట్‌లో) రామలింగారెడ్డి(ఫైల్‌)

అనారోగ్యంతో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి 

స్వగ్రామం చిట్టాపూర్‌లో అంత్యక్రియలు 

వేలాదిగా తరలివచ్చిన నాయకులు, అభిమానులు 

సీఎం కేసీఆర్, కేటీఆర్‌ ఇతరమంత్రుల నివాళి 

పాడె మోసిన మంత్రి హరీశ్‌రావు 

చితికి నిప్పంటించిన కుమారుడు సతీష్‌రెడ్డి 

సాక్షి, సిద్దిపేట/దుబ్బాక/దుబ్బాక టౌన్‌: మా లింగన్న అని ఆప్యాయంగా పిలుచుకునే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసన సభ్యులు సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ వార్త ఉమ్మడి మెదక్‌ జిల్లాతోపాటు రాష్ట్ర నలుమూలల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులు, లింగన్న అభిమానులు చిట్టాపూర్‌ చేరుకున్నారు. ఉద యాన్నే హైదరాబాద్‌ నుంచి చిట్టాపూర్‌కు పార్థివదే హాన్ని తీసుకవచ్చి అభిమానుల కడ సారి చూపు కోసం ఉంచారు. అప్పటికే కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవీస్‌లు  కోవిడ్‌ నేపథ్యంలో ఎవ్వరూ ఇబ్బందులకు పడకుండా ఏర్పాట్లు చేశారు.  

వేలాదిగా తరలివచ్చిన అభిమానులు 
తమ ప్రియతమ నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి మరణించాడనే వార్త వినగానే ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఒక వైపు కోవిడ్‌ భయం ఉన్నప్పటికీ వేలాది మంది చిట్టాపూర్‌ చేరుకొని తమ నాయకుడిని కడసారిగా చూసి నివాళి అర్పించారు.  ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇంటి వద్దనే ఉంచిన పోలిపేట మృతదేహానికి తర్వాత కూడవెల్లి వాగు సమీపంలోని ఆయన సొంత భూమిలో దహన సంస్కారాలు నిర్వహించారు.  

అంతిమయాత్రలో ప్రముఖులు 
అంతిమయాత్రలో కొద్ది దూరం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిలు ముందు పాడె మోయగా.. వెనక బంధువులు పాడెను పట్టారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై పార్థివదేహాన్ని ఉంచి ఊరేగింపుగా తరలించారు. ఇలా చిట్టాపూర్‌ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన సోలిపేట అంతిమ యాత్ర సిద్దిపేట – మెదక్‌ ప్రధాన రహదారి మీదుగా.. కూడవెల్లి వాగు సమీపంలోని స్మృతీ వనానికి తరలించారు.  

అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమారుడు 
సోలిపేట అంతిమ సంస్కారాలు చిట్టాపూర్‌ గ్రామం కూడవల్లి వాగు సమీపంలో హిందూ ధర్మ సిద్ధాంతం ప్రకారం నిర్వహించారు. ఆయన కుమారుడు సతీష్‌రెడ్డి తలకొరివి పెట్టి చితికి నిప్పంటించారు.  

సోలిపేటకు ప్రముఖుల నివాళి 
సోలిపేట పార్థివదేహంపై సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. హాజరైన వారిలో రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కల్వకంట్ల తారక రామారావు, ఈటెల రాజేందర్, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్‌లు ఉన్నారు. అదేవిధంగా మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి శుభాష్‌రెడ్డి, బోడెపూడి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పద్మాదేవేంద్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, జోగురామన్న, పెద్ది సుదర్శన్‌రెడ్డి, హన్మంత్‌ షిండే, రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్‌ నందిని సిద్దిరెడ్డి, సీఎం ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వేలేటి రోజాశర్మ, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్‌ డేవీస్‌ హాజరై నివాళి అర్పించారు.   

అన్నీ తానై.. 
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి హరీశ్‌రావు అన్నీ తానై దగ్గరుండి నడిపించారు. మంత్రి హరీశ్‌రావుకు మొదటి నుంచి ఎమ్మెల్యే రామలింగారెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు మంత్రి హరీశ్‌రావు వెళ్లి ఆయన ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు. గురువారం రామలింగారెడ్డి మరణించడంతో ఆయన మృతదేహం స్వగ్రామం చిట్టాపూర్‌ చేరుకోగానే ఉదయం 7 గంటలకే మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో వచ్చి రామలింగారెడ్డి పార్థివదేహాన్ని చూసి కంటతడిపెట్టారు. ఎమ్మెల్యే సతీమణి సుజాత, కుమారుడు సతీష్‌రెడ్డిని ఓదార్చారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్‌లకు అన్ని వివరించారు. అంత్యక్రియలకు స్వయంగా మంత్రి దగ్గరుండి కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డితో చర్చిస్తూ ఏర్పాట్లు చేయించారు. అంత్యక్రియల సందర్భంగా హరీశ్‌రావు పాడె మోసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకంటూ కంట తడిపెట్టుకున్నారు.   

మరిన్ని వార్తలు