TRS MLAs Issue Case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితుల బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

14 Nov, 2022 16:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని ముగ్గురు నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు సోమవారం కొట్టివేసింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్‌ మంజూరు చేస్తే కేసును, సాక్ష్యాలను  ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వ  న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు.. నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. బెయిల్‌ మంజూరు కాకపోవడంతో ముగ్గురు నిందితులు యథావిధిగా చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉండనున్నారు.

కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డికి రూ.100 కోట్లు ఇస్తామ‌ని ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలపై రామచంద్రభారతి, నందు, సింహయాజి అనే ముగ్గురు వ్యక్తులను సాక్ష్యాధారాల‌తో స‌హా మొయినాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు సంస్థ (సిట్‌) విచారిస్తోంది. ఎరకు ఎక్కడ? ఎప్పుడు బీజం పడిందో తేల్చే పనిలో పడ్డారు. రామచంద్రభారతి, నందు, సింహయాజీలకు ఒకరితో మరొకరికి పరిచయం ఎలా ఏర్పడింది? వీరిని ఎవరెవరు కలిశారు? అనే వివరాలను రాబట్టడంలో నిమగ్నమయ్యారు.
చదవండి: 'ఆ నలుగురు' ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్‌.. 4 ఠాణాల్లో ఫిర్యాదులు..

పీటీ వారెంట్‌
మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై పోలీసులు పీటీ వారెంట్‌ కోరారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో  బంజారాహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇప్పటికే నందకుమార్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో రెండు కేసులు నమోదవ్వగా.. కేసు దర్యాప్తులో భాగంగా విచారించేందుకు  నందకుమార్‌ అరెస్ట్‌కు అనుమతించాలని పోలీసులు కోరారు. ఎమ్మెల్యేల ఎర కేసులో ఏ2 గా ఉన్న నందకుమార్.. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పీటీ వారెంట్‌కు నాంపల్లి కోర్టు అనుమతిస్తే.. పోలీసులు నందును విచారించనున్నారు.

మరిన్ని వార్తలు