కొబ్బరి నీళ్లు తీసుకురా..! 

29 Oct, 2022 00:49 IST|Sakshi

రోహిత్‌రెడ్డి ‘కొబ్బరి నీళ్లు పట్టుకురా’ అనగానే దాడి చేసేందుకు స్కెచ్‌ 

పక్కా ప్రణాళికతోనే రంగంలోకి దిగిన పోలీసులు  

రోహిత్‌రెడ్డి జేబులో వాయిస్‌ రికార్డర్లు..హాల్లో రహస్య కెమెరాలు 

హైకోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉద్దేశంతో ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసు కావటంతో పక్కా సాక్ష్యాధారాలతో నిందితులను పట్టుకునేందుకు ప్రణాళిక రూపొందించాకే సైబరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీలోని ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభారతి అలియాస్‌ సతీష్‌ శర్మ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజి స్వామిలను పకడ్బందీ స్కెచ్‌తో ట్రాప్‌లో పడేశారు. ముందస్తు ప్రణాళికతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి జేబుల్లో వాయిస్‌ రికార్డర్లు, హాల్లో కెమెరాలు అమర్చారు.

రోహిత్‌రెడ్డి ‘కొబ్బరి నీళ్లు తీసుకురా..’ అంటూ సంకేతాన్ని ఇచ్చిన తర్వాత దాడి చేసేలా వ్యూహం రూపొందించారు. ఈనెల 26న రాత్రి మెయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డిలతో చర్చలు జరిపేందుకు ముగ్గురు బీజేపీ రాయబారులు వస్తున్న సంగతి ముందుగానే తెలియడంతో ఈ మేరకు స్కెచ్చేశారు.

శుక్రవారం హైకోర్టుకు  సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు ఈ అంశాలన్నీ పొందుపరిచారు. రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌ కావటంతో ఆయన్నే లీడ్‌గా తీసుకొని ఈ స్కెచ్‌ వేసినట్లు, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్‌ రెడ్డికి సహకరించేందుకు వెళ్లినట్లు తెలిపారు. రిమాండ్‌ రిపోర్ట్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.  

స్పష్టంగా రికార్డయ్యేలా.. 
ఎమ్మెల్యేలతో ముగ్గురు నిందితుల ఆడియో, వీడియో సంభాషణలు స్పష్టంగా  రికార్డయ్యేలా అత్యాధునిక కెమెరాలను వినియోగించారు. రోహిత్‌రెడ్డి కుర్తా జేబుల్లో రెండు వాయిస్‌ రికార్డర్లు, వారు కూర్చొని ఉన్న హాల్‌లో నాలుగు అత్యాధునిక రహస్య కెమెరాలు భేటీ కంటే ముందే బిగించారు. ఫామ్‌హౌస్‌ హాల్‌లోని రహస్య కెమెరాలను మధ్యాహ్నం 3.05 గంటలకు ఆన్‌ చేశారు. మరో 5 నిమిషాల తర్వాత 3.10 గంటలకు ముగ్గురు నిందితులతో కలిసి రోహిత్‌ రెడ్డి హాల్లోకి వచ్చారు. సాయంత్రం 4.10 గంటలకు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌ రెడ్డి, రేగ కాంతరావులు వచ్చినట్లు రికార్డయింది. సుమారు మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారు.  

సిగ్నల్‌ ఇవ్వగానే.. 
ఎమ్మెల్యేలతో నిందితులు సంభాషిస్తున్నప్పుడు ఏ సమయంలో పోలీసులు దాడి చేయాలన్నది ముందుగానే స్కెచ్‌ వేశారు. చర్చలు పూర్తయ్యాక ఏదైనా ఒక సిగ్నల్‌ వస్తే లోపలికి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవా లని పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు నిందితులతో భేటీ పూర్తికాగానే రోహిత్‌రెడ్డి ‘కొబ్బరి నీళ్లు తీసుకురా’ అని సిగ్నల్‌ ఇచ్చేలా ఆయన్ని ముందుగానే ప్రిపేర్‌ చేశారు. ఆ మేరకు రోహిత్‌రెడ్డి ‘కొబ్బరి నీళ్లు తీసుకురా’ అని అనగానే సైబరాబాద్‌ పోలీసులు ఒక్కసారిగా లోనికి ప్రవేశించారు. తలుపులు తెరిచి నలుగురు ఎమ్మెల్యేలతో ఉన్న ముగ్గురు నిందితులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 ఇస్తామన్న సంభాషణ వాయిస్‌ రికార్డర్లలో నమోదైంది. అలాగే కర్ణాటక, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ ఈ తరహా ఆపరేషన్‌ చేశామన్న రామచంద్రభారతి సంభాషణ, తుషార్‌కు రామచంద్రభారతి ఫోన్‌ చేయడం కూడా రికార్డయ్యాయి. తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్‌ కుమార్‌ బన్సల్‌కు రామచంద్రభారతి సెల్‌ఫోన్‌ సందేశం పంపినట్లు కూడా రికార్డయింది. కాగా ఈ మెసేజ్‌తో పాటు రామచంద్ర భారతి, నందకుమార్‌ వాట్సప్‌ చాటింగ్‌లను స్క్రీన్‌ షాట్లు తీసి సాక్ష్యాధారాల కోసం పొందుపరిచినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడించారు. 

నందు డైరీలో 50 మంది జాబితా.. 
నందకుమార్‌ డైరీలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యేల వివరాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇందులో 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ.. ‘సంతోష్‌ బీజేపీ‘ పేరుతో ఉన్న ఫోన్‌ నంబర్‌కు రామచంద్రభారతి వాట్సప్‌ మెసేజ్‌ పంపించారని తెలిపా. ఇలావుండగా నిందితుల నుంచి పోలీసులు సెల్‌ఫోన్లు, డైరీ స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు