జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు

16 Nov, 2022 00:45 IST|Sakshi

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ అప్పీల్‌పై హైకోర్టు ఉత్తర్వులు

దర్యాప్తు నివేదికను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించాలి

వివరాలపై అధికారులకు, నేతలకు లీకులివ్వొద్దు

మీడియాకు వివరాలు వెల్లడించవద్దని ఆదేశించిన సీజే ధర్మాసనం

సీబీఐ విచారణకు నిరాకరణ

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణ హైకోర్టు సింగిల్‌ జడ్జి పర్యవేక్షణలోనే సాగాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన క్రైమ్‌ నంబర్‌ 455/2022లో సిట్‌ దర్యాప్తులో ముందుకెళ్లవచ్చని సూచించింది. దర్యాప్తు తొలి నివేదికను సీల్డ్‌ కవర్‌లో ఉంచి ఈ నెల 29న సింగిల్‌ జడ్జి ముందు సమర్పించాలని ఆదేశించింది.

ఇకపై దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు కోర్టుకు వెల్లడించాలని పేర్కొంది. మీడియాకు, ఇతర ఉన్నతాధికారులకు, రాజకీయ ప్రతినిధులకు విచారణకు సంబంధించిన ఎలాంటి వివరాలకు వెల్లడించరాదని, లీక్‌ చేయొద్దని తేల్చిచెప్పింది. సిట్‌లో ఇతర ఉన్నతాధికారుల జోక్యం కూడా చేసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. అలాగే కేసు నమోదు చేసిన సమయంలో, విచారణ సందర్భంగా సీజ్‌ చేసిన వస్తువులు, పత్రాలను కోర్టుకు సమర్పించాలని చెప్పింది.

వివరాలు లీక్‌ అయితే దానికి సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని వెల్లడించింది. సిట్‌కు ఎలాంటి అవసరాలు ఉన్నా సింగిల్‌ జడ్జి అనుమతి తీసుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవచ్చని వివరించింది. ఆ మేరకు స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం తీర్పునిచ్చింది.

సీబీఐ విచారణకు నిరాకరించింది. ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో స్టేను ఎత్తివేస్తూ.. పోలీస్‌ దర్యాప్తునకు అనుమతిస్తూ.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను బీజేపీ హైకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ చిదంబరం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. 

సీఎం చేతికి ఆడియో సీడీలు..
‘మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అక్టోబర్‌ 26న నమోదైన ఈ కేసులో పోలీసులు పక్షపాతం, అన్యాయంగా విచారణ సాగిస్తున్నారు. బీజేపీని దోషిగా నిలబెట్టాలనే సీఎం, టీఆర్‌ఎస్‌ ముఖ్యుల ఆదేశాలతో దర్యాప్తు సాగుతోంది. కావాలనే బీజేపీపై నిందమోపుతూ అప్రతిష్టకు చేస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులను, ఆధారాలను సీజ్‌ చేసి ఉంచాలి.

అయితే అవన్నీ సీఎం కేసీఆర్‌ చేరవేయడంతో పాటు.. ఆయన మీడియా సమావేశంలో అందరికీ ఆడియో, వీడియో ఫుటేజీ సీడీలను పంచిపెట్టారు. అలాగే బీజేపీ జాతీయ స్థాయి నేతలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. పరిస్థితుల నేపథ్యంలో సింగిల్‌ జడ్జి గత నెల 29న ఇచ్చిన స్టే ఉత్తర్వులను పొడిగించాలి. నేరుగా సీబీఐ విచారణకు ఆదేశించే అధికారం కోర్టుకు ఉందని చెప్పారు. ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలి’అని వైద్యనాథన్‌ విజ్ఞప్తి చేశారు. 

సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదు..
‘ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా పోలీస్‌ విచారణపై ఇప్పటివరకు స్టే ఇవ్వలేదు. అసలు సింగిల్‌ జడ్జి వద్ద బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌లో పోలీస్‌ దర్యాప్తుపై స్టే విధించాలన్న అంశమే ప్రేయర్‌లో లేదు. కాగ్నిజబుల్‌ నేరాల్లో పోలీసు దర్యాప్తును కోర్టులు అడ్డుకోలేవు. థర్డ్‌ పార్టీ అయిన బీజేపీకి లోకస్‌ క్యాండి అర్హతే లేదు’అని దవే చెప్పారు.

‘ఆడియో టేపులు, ఇతర వివరాలు టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడికి ఎలా చేరాయి.. ఆయన మీడియాకు ఎలా పంచారు. అలాగే పెన్‌డ్రైవ్‌లు, సీడీలకు మాకు అందాయి. ఇతర హైకోర్టులకు కూడా అందాయని తెలిసింది’అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై దవే స్పందిస్తూ.. తన విచారాన్ని వ్యక్తం చేయడంతోపాటు అలా జరగకుండా ఉండాల్సిందని అన్నారు. విచారణకు ప్రభుత్వం సిట్‌ కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు.  

మరిన్ని వార్తలు