ట్రాప్‌ కేసులో అదే రోజు బెయిల్‌ ఇస్తారుగా.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య 

5 Nov, 2022 14:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏదైనా ట్రాప్‌ అయిన కేసుల్లో అదే రోజు బెయిల్‌ ఇస్తున్నారుగా అని తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీ కోర్టుకెందుకు వెళ్లిందన్న సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను హైకోర్టు ఎలా స్వీకరించిందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ట్రయల్‌కోర్టు ఆదేశాలు పక్కనపెడుతూ హైకోర్టు రిమాండ్‌ విధించడాన్ని సవాల్‌ చేస్తూ రామచంద్ర భారతి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయ వాది విశ్వనాథన్‌ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పిటిషనర్లను అరెస్టు చేశారని తెలిపారు. సాధారణ పోలీసులు వచ్చి ట్రాప్‌ చేసినట్లు పేర్కొన్నారు. నగదు దొరికిన ట్రాప్‌ కేసుల్లోనూ అదే రోజూ బెయిలు ఇస్తున్నారు కదా అని జస్టిస్‌ బీఆర్‌ గవాయి ప్రశ్నించారు. దర్యాప్తుపై స్టే విధించాలని ఓ రాజకీయ పార్టీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. స్టే నడుస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూత్రా పేర్కొన్నారు. ఓ పార్టీ పిటిషన్‌ దాఖలు చేయడం, హైకోర్టు విచారణకు స్వీకరించడం ఏంటని జస్టిస్‌ బీఆర్‌ గవాయి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ పిటిషన్‌తో తమకు సంబంధం లేదని విశ్వ నాథన్‌ పేర్కొన్నారు. రెండు పార్టీలల రచ్చలో పిటిషనర్‌ను ఇబ్బందిపెడుతున్నారన్నారు.

అసలు హైకోర్టులో ఏం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించగా.. దర్యాప్తుపై సోమవారం వరకూ స్టే కొనసాగించిందని వివరించారు. ‘ఏదేమైనా ప్రస్తుత పిటిషన్, హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నా.. పిటిషనర్లు బెయిల్‌ దరఖాస్తును ట్రయల్‌కోర్టు న్యాయమూర్తి పరిశీలించడానికి అడ్డంకి కావు. మెరిట్స్‌పై దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోవాలని ట్రయల్‌ కోర్టుకు చెప్పాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణ నవంబర్‌ 7కు వాయిదా వేస్తున్నాం’అని ధర్మాసనం పేర్కొంది. ఈ సమయంలో ట్రయల్‌కోర్టు తమ రిమాండ్‌ దరఖాస్తు కూడా పరిశీలించాలని ఒకట్రెండుసార్లు సిద్దార్థ లూత్రా ప్రస్తావించారు. ఇలా వ్యవహరిస్తే నిందితులకు బెయిల్‌ ఇవ్వాల్సి ఉంటుంది అని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.

సీబీఐతో విచారణ జరిపించండి 
సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) దర్యాప్తు జరిపించాలని కోరుతూ నిందితులు రామచంద్ర భారతి, నందుకుమార్, సింహయాజీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు విచారణ పారదర్శకంగా చేస్తారన్న నమ్మకం తమకు లేదని చెప్పారు. ‘అక్టోబర్‌ 26న, మొయినాబాద్‌లోని రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో అవినీతి నిరోధక చట్ట ప్రకారం కేసు నమోదు చేసి మమల్ని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీలో చేరేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇవ్వజూపినట్లు కేసులో పేర్కొన్నారు. 27న రిమాండ్‌ను పోలీసులు కోరగా, ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీనిపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.

కిందికోర్టు ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు.. మమల్ని వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. అనంతరం పోలీసులు మమల్ని అరెస్టు చేసి జైలు కు తరలించారు. ఈ నేపథ్యంలోనే మా ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు చెబుతూ.. పలు ఆడియో టేపులను బయటికి లీక్‌ చేశారు. మా వ్యక్తిగత సంభాషణలను కూడా లీక్‌ చేశారు. ఇది టెలిగ్రాఫిక్‌ చట్ట నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర అధికార పార్టీ నేరు గా ప్రమేయం ఉన్న ఈ కేసులో పోలీస్‌ విచారణ సక్రమంగా సాగుతుందన్న నమ్మకం మాకు లేదు. ఈ నేపథ్యంలో కేసును సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జి నేతృత్వంలోని సిట్‌తో విచారణ జరిపించాలని కోరుతున్నాం’అని పిటిషన్‌లో పేర్కొన్నారు  

స్టేను ఎత్తివేయండి 
సాక్షి, హైదరాబాద్‌:  ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో విచారణను సీబీఐ లేదా సిట్‌తో జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలన్న బీజేపీ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. ఇదే విచారణ కోరుతూ నిందితుడు కోరే నందుకుమార్‌ సతీమణి చిత్రలేఖ కూడా ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్‌రావు, పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జె.ప్రభాకర్‌ హాజరై వాదనలు వినిపించారు. ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖ లుచేస్తూ.. స్టేను ఎత్తివేయడంతోపాటు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. కౌంటర్‌పై పరిశీలనకు సమయం కావాలని ప్రభాకర్‌ కోరడంతో విచారణను వాయిదా వేసింది.  

తేదీ తప్పుగా పేర్కొనడం పొరపాటే..  
ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిల్‌ పేర్కొన్న వివరాలు.. ‘టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మె ల్యేలు పార్టీ మారడానికి రూ.50 కోట్ల చొప్పున నగదు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశా రు. పోలీసులకు ముందుగా ఉన్న సమాచారం మేరకు ఫామ్‌హౌస్‌లో సీసీ కెమెరాలు, వాయిస్‌ రికార్డ్‌లు ఏర్పాటు చేశారు. నిందితులు వచ్చిన తర్వాత రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 120–బీ, 171–వీ ఆర్‌/డబ్ల్యూ 171–ఈ, 506 ఆర్‌/డబ్ల్యూ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 8 కింద క్రైం నంబర్‌ 455/2022 నమోదు చేశారు. నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీ సెల్‌ఫోన్లు సీజ్‌ చేశారు. పోలీసులు వీటి ద్వారా పలు సమాచారం తెలుసుకున్నారు. ఇందులో నిందుతులు ఎమ్మెల్యేలతో జరిపిన సంభాషణలు, ఇతర ఆధారాలు ఉన్నాయి. 

గత నెల 26న రాత్రి కేసు నమోదు చేయ గా, మరుసటి రోజు(24గంటలైనా గడవక ముందే) విచారణ పారదర్శకంగా జరగడంలేదని బీజేపీ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. గత నెల 26న రాత్రి పంచనామా ప్రారంభించారు.. పూర్త య్యే సరికి 27వ తేదీ ఉదయం 8.30 అయ్యింది. అనంతరం మధ్యవర్తులతో సంతకాలు చేయించారు. రఫ్‌ స్కెచ్‌ తయారు చేయగా, దానిపై కూడా సంతకాలు చేశారు. అయితే మధ్యవర్తులు పొరపాటున తేదీని 26గా రాశారు. ఈ ఒక్క కారణాన్ని చూపి సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదు. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. నిందితులను రిమాండ్‌కు తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్టేను ఎత్తివేయాలని, పోలీస్‌ దర్యాప్తునకు అనుమతించాలని కోరుతున్నాం. కేసు విచారణను సీబీఐకు అప్పగించాల్సిన అవసరం లేదు.’  

మరిన్ని వార్తలు