23న పల్లా నామినేషన్‌!

18 Feb, 2021 04:21 IST|Sakshi

బీ ఫారం అందజేసిన టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ 

‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’పై అస్పష్టత 

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి ‘వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ’జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం బీ ఫారం అందజేశారు. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో సీఎం కేసీఆర్‌ను రాజేశ్వర్‌రెడ్డి కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ‘వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ’ నియోజకవర్గం నుంచి రాజేశ్వర్‌రెడ్డి మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా అభ్యర్థిత్వాన్ని పార్టీ గతంలోనే ఖరారు చేయడంతో ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 16న ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం 23వ తేదీ వరకు కొనసాగనుండగా, చివరిరోజున భారీ బలప్రదర్శనతో నామినేషన్‌ దాఖలు చేసేందుకు పల్లా సన్నాహాలు చేసుకుంటున్నారు. గురువారం రాజేశ్వర్‌రెడ్డి తరఫున లాంఛనంగా నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.  

పీఎల్‌ శ్రీనివాస్‌కు అవకాశం ఇస్తారా? 
శాసనమండలి ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’స్థానంలో టీఆర్‌ఎస్‌ పోటీకి సంబంధించి అస్పష్టత కొనసాగుతోంది. ఈ స్థానానికి మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగినా ఒక్కసారి కూడా కైవసం చేసుకోకపోవడంతో పోటీకి దూరం గా ఉండాలని టీఆర్‌ఎస్‌ యోచిస్తున్నట్లు సమాచారం. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైనా అభ్యర్థి ఎంపిక, ప్రచారసన్నాహాలకు సంబంధించి ఎలాంటి కదలిక కనిపించడం లేదు. కాగా పార్టీ సీనియర్‌ నేత, విద్యాసంస్థల అధినేత పీఎల్‌ శ్రీనివాస్‌ బుధవారం కేటీఆర్‌ను కలిశారు. ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’శాసనమండలి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించడంతోపాటు అవకాశం ఇస్తే తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు