మంత్రి, ఎమ్మెల్యేకే ఫ్లెక్సీలు కడతారా?

19 Sep, 2022 03:41 IST|Sakshi
డీఎఫ్‌వోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ మధు

అధికారులపై ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహం

కూసుమంచి: ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటుచేసిన చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రొటోకాల్‌ వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రకు అధికారులు ఆహ్వానం అందించారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలుకావలసి ఉండగా, పదిన్నర సమయాన హైదరాబాద్‌ నుండి ఎమ్మెల్సీ, ఎంపీలు రిజర్వాయర్‌ వద్దకు వచ్చారు. అప్పటికింకా ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి చేరుకోలేదు. దీంతో ఎమ్మెల్సీ తాతా మధు.. ఎమ్మెల్యే ఎక్కడి వరకు వచ్చారంటూ ఆరాతీయగా మార్గమధ్యలో ఉన్నారని డీఎఫ్‌వో ఆంజనేయస్వామి బదులిచ్చారు. సమయపాలన లేకుంటే ఎలా? అంటూ ఎమ్మెల్సీ ఒకింత అసహనానికి గురవుతూనే, పక్కనే ఉన్న ఫ్లెక్సీలలో.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్‌ గౌతమ్‌ ఫొటోలతో మూడు ఫ్లెక్సీలను గమనించారు.

దీంతో ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘మీరు ఆఫీసర్లు ఆఫీసర్లుగా ఉండాలి.. పనికిమాలిన పనులు చేయొద్దు. మీరు గవర్నమెంట్‌ అధికారి కాబట్టి ఎవరికీ ఊడిగం చేయొద్దు.. అందరికీ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టలేదు? ఎమ్మెల్యే, మంత్రికే ఫ్లెక్సీలే ఎందుకు పెట్టారు.. గవర్నమెంట్‌ మీకు చెప్పిందా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడి నుండి ఎంపీలు, ఎమ్మెల్సీ ఖమ్మం వెళ్లిపోయారు. కాసేపటికి వచ్చిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి రిజర్వాయర్‌లో చేపపిల్లలను విడుదల చేశారు. అంతకుముందు జరిగిన ఘటనపై అధికారులను మందలించడమే కాక ప్రొటోకాల్‌ పాటించకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. కాగా, కార్యక్రమం ముగిశాక ఎంపీ, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని అధికారులు ఏర్పాటు చేయడం కొసమెరుపు.

ఇదీ చదవండి: ఈడీ లేకుంటే బీజేపీనే లేదు

మరిన్ని వార్తలు