ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడం హక్కుల ఉల్లంఘనే!

5 Apr, 2021 03:14 IST|Sakshi

 టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు  

హైదరాబాద్‌: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటూ నాగ్‌పూర్‌ జైల్లో ఉన్న ప్రొఫెసర్‌ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. కేసు విచారణలో ఉండగానే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంలాల్‌ ఆనంద్‌ కాలేజీ.. సాయిబాబా సర్వీసులను టెర్మినేట్‌ చేయడం సరికాదన్నారు. గతంలో కోర్టు కేసుల్లో నిర్దోషులుగా బయటపడి తమ ఉద్యోగాల్లో యథావిధిగా చేరిన ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నారని ఆయన గుర్తుచేశారు.

సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని స్పష్టంచేశారు. ఆయన అంగ వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో జైలు నుంచి విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రికి గతంలోనే లేఖ రాశానని తెలిపారు.   

మరిన్ని వార్తలు