ప్రాంతీయ భాషల్లోనే పోటీ పరీక్షలు

6 Aug, 2021 04:22 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం నిర్వహించే అన్ని పరీక్షలను 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం లోక్‌సభలో జీరో అవర్‌ సందర్భంగా జాతీయస్థాయి పోటీ పరీక్షలను తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరుతూ నోటీస్‌ ఇచ్చారు. హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల హిందీయేతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు.

ప్రైవేటు విద్యాసంస్థలను సీజీటీఎంఎస్‌ఈలో చేర్చాలి: నామా  
కోవిడ్‌ కారణంగా నష్టపోయిన ప్రైవేటు విద్యాసంస్థలను ఆదుకోవడానికి క్రెడిట్‌ గ్యారెంటీ ఫండ్‌ ట్రస్ట్‌ ఫర్‌ మైక్రో అండ్‌ స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (సీజీటీఎంఎస్‌ఈ) పథకంలో చేర్చాలని టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ఆదుకోవాలని కోరుతూ గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖరాశారు.  

రైతులను శిక్షించడం న్యాయమా?: సురేశ్‌రెడ్డి 
కాలుష్యానికి కారణమంటూ రైతులను శిక్షించడం ఎంతవరకు న్యాయమని టీఆర్‌ఎస్‌ ఎంపీ సురేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ పరిసరాల్లో వాయు నాణ్యత యాజమాన్య కమిషన్‌ బిల్లుపై గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. ‘ఈ బిల్లులోని క్లాజ్‌ 15ను కేంద్రం పునః పరిశీలించాలి. కాలుష్య నివేదికలు పరిశీలిస్తే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వరి, ఇతర పంటల గడ్డి కాల్చివేత వల్ల కారణమైన కాలు ష్యం వాటా కేవలం 4 శాతమే. గతంలో సెప్టెంబరులో పంట చేతికి రావడంతో వీచే గాలి వాయు కాలుష్యాన్ని నివారించేది. వాతావరణ మార్పుల వల్ల పంటల కాలం కూడా మారింది’ అన్నారు.

ఖాయితా లంబాడీ, బోయలను ఎస్టీల్లో చేర్చాలి: బండ ప్రకాశ్‌ 
ఖాయితా లంబాడీ, బోయలను ఎస్టీ జాబితాలో చే ర్చాలని టీఆర్‌ఎస్‌ కేంద్రా న్ని కోరింది. రాజ్యాంగ సవరణ (షెడ్యూల్డ్‌ తెగలు) బిల్లు–2021పై జరిగిన చర్చలో ఎంపీ బండ ప్రకాశ్‌ కేంద్రానికి విన్నవించారు. ‘ఖాయితా లంబాడీలను, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తెలంగాణలో చెల్లప్ప కమిషన్‌ ఏర్పాటైంది. ఆ కమిషన్‌ రాష్ట్రమంతా పర్యటించి సానుకూల నివేదికిచ్చింది. వీటిని అమలు చేయాలని శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి పంపి మూడేళ్లయింది’ అని తెలిపారు.   

మరిన్ని వార్తలు