ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే గెలవాలి 

1 Mar, 2021 03:03 IST|Sakshi

‘వరంగల్‌– ఖమ్మం– నల్గొండ’ మంత్రులు, చీఫ్‌ విప్‌లు, విప్‌లతో కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ ప్రచారం తీరుతెన్నులపై సుదీర్ఘ సమీక్ష

పార్టీ వ్యూహం, ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి

ఓటర్లతో చివరి వరకు మమేకం కావాలి 

సాక్షి, హైదరాబాద్‌: ‘వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలో ప్రచార పరంగా ఇతరులతో పోలిస్తే మనం ముందంజలో ఉన్నాం. అయితే కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, అలసత్వానికి తావు లేకుండా మరింత లోతుగా పార్టీ వ్యూహం, ప్రణాళికను అమలు చేయండి. ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే మనం గెలుపొందాలి. పోలింగ్‌కు కేవలం 14 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున ప్రతి ఓటరును కలిసేలా పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయండి..’అని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలోని మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌లు, విప్‌లను ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రచార తీరుతెన్నులపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్, సత్యవతి రాథోడ్, చీఫ్‌ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, దాస్యం వినయ్‌ భాస్కర్, విప్‌ గొంగిడి సునీత, రేగ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌.. పోలింగ్‌ తేదీ వరకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. 

చివరి నిమిషం వరకు అప్రమత్తంగా ఉండాలి 
‘సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నికలు కొంత భిన్నంగా ఉంటాయి. ప్రతి ఓటరును కలిసి మన ఎజెండాను వివరించడంతో పాటు పోలింగ్‌లో పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేసుకోండి. గతంలో దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కొంత అతి విశ్వాసంతో వెళ్లడంతో నష్టం జరిగింది. ఈసారి అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఓటర్లతో చివరి నిమిషం వరకు మమేకం కావాలి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా వారి ప్రభావం పెద్దగా లేదు. ఇతర అభ్యర్ధుల్లో ఒకరిద్దరి పట్ల ఓటర్లలో కొంత సానుభూతి ఉన్నా వారికి క్షేత్ర స్థాయిలో యంత్రాంగం లేదు. 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 30 చోట్ల్ల మన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నందున పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ చివరి నిమిషం వరకు అప్రమత్తంగా వ్యవహరించాలి..’అని కేసీఆర్‌ సూచించారు. 

50 శాతానికి పైగా ఓట్లు సాధించాలి 
‘ఈ నియోజకవర్గంలో 5 లక్షల పైచిలుకు పట్టభద్ర ఓటర్లు ఉండగా, ఇందులో సుమారు 3 లక్షల మందిని మన పార్టీ యంత్రాంగం ద్వారా నమోదు చేశాం. పోలయ్యే ఓట్లలో 50%కి పైగా ఓట్లు మన అభ్యర్థి సాధించేలా క్షేత్ర స్థాయిలో శ్రమించాలి. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా పనిచేయండి. క్షేత్ర స్థాయిలో పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర క్రియాశీల నేతలు, కార్యకర్తలు అందరినీ ప్రచారంలో భాగస్వాములను చేయాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. 

షెడ్యూల్‌ వెలువడిన తర్వాత సాగర్‌పై చర్చ! 
నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడిన తర్వాత మరోమారు సమావేశమవుదామని కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. పట్టభద్రుల ఎన్నికకు సంబంధించిన సమావేశం ముగిసిన తర్వాత నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, విప్‌ గొంగిడి సునీతతో పాటు మరో ఇద్దరు ముఖ్య నేతలతో కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. అయితే సాగర్‌ ఉప ఎన్నికపై లోతైన చర్చ జరగలేదని, ఆ నియోజకవర్గం పరిధిలో పట్టభద్రుల ఎన్నికతో పాటు ఉప ఎన్నికను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రచారం కొనసాగించాలని సూచించినట్లు తెలిసింది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు