Huzurabad Bypoll: కుల సమీకరణాలు.. ఓట్ల లెక్కలు..

12 Oct, 2021 01:03 IST|Sakshi

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతున్న కొద్దీ టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహానికి మరింత పదును పెడుతోంది. తొలుత పార్టీ కేడర్‌తో, ఆ తర్వాత గ్రామాలు, మండలాల వారీగా వివిధ సామాజికవర్గాల మద్దతు కూడగట్టేందుకు ఆత్మీయ సభలు నిర్వహిస్తూ వచ్చిన గులాబీ దళం.. ఇప్పుడు నియోజకవర్గాల స్థాయిలో మరోమారు సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు భారీ సభలు సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో పొరుగునే ఉన్న హనుమకొండ జిల్లా పెంచికల్‌పేటను ఎంచుకుంది.   

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం వేడెక్కుతున్న కొద్దీ టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహానికి మరింత పదునుపెడుతోంది. తొలుత పార్టీ కేడర్‌తో, ఆ తర్వాత గ్రామాలు, మండలాల వారీగా వివిధ సామాజికవర్గాల మద్దతు కూడగట్టేందుకు ఆత్మీయసభలు నిర్వహిస్తూ వచ్చిన గులాబీ దళం.. ఇప్పుడు నియోజకవర్గాల స్థాయిలో మరోమారు సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు భారీ సభలు సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో పొరుగునే ఉన్న హనుమకొండ జిల్లా పెంచికల్‌పేటను ఎంచుకుంది.

పెంచికల్‌పేటలోని బహిరంగ ప్రదేశంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి కులాల వారీగా ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తోంది. మూడు రోజుల క్రితం ఆరె కటికల సభ ఏర్పాటు చేయగా, సోమవారం మున్నూరుకాపు ప్రతినిధులతో భేటీ నిర్వహించింది. టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులైన బాజిరెడ్డి గోవర్దన్‌కు సన్మానం పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి మున్నూరుకాపు ప్రతినిధులు హాజరయ్యారు. పక్షం రోజులపాటు మరిన్ని సామాజిక వర్గాలతో ఆత్మీయ సభలు కొనసాగించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. పెంచికల్‌పేట కేంద్రంగా దసరా తర్వాత నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి. 

జాబితాల వడపోత 
కులాలు, పథకాల లబ్ధిదారులైన్ల ఓటర్ల లెక్కలను ఇప్పటికే గ్రామాలు, వార్డుల వారీగా వర్గీకరించి ఉపఎన్నికలో మండలాలు, మున్సిపాలిటీలవారీగా ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు అందజేశారు. వీరితోపాటు మంత్రులు ఈ జాబితాలను వడపోసి ఓటర్ల మద్దతు కూడగట్టడంలో తలమునకలై ఉన్నారు. బయటకు సభలు, సమావేశాలు, ధూంధాంల పేరిట ప్రచార ఆర్భాటం జరుగుతున్నా, అంతర్గ తంగా మాత్రం సామాజికవర్గాలు, పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్‌ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది.

ప్రధాన సామాజికవర్గాలైన రెడ్డి, మున్నూరుకాపు, పద్మశాలి, యాదవ, మాల, మాదిగ, ఎస్టీల ఓట్ల కోసం అదే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వందల సంఖ్యలో ఓటర్లు కలిగిన కుమ్మరి, పెరిక కులస్తులపైనా అదే కులా లకు చెందిన ఇన్‌చార్జి నేతలు దృష్టి పెట్టారు. మరో వైపు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్‌ ఉద్యోగ సంఘాలతోపాటు కిరాణా, ఆయిల్, క్లాత్‌ మర్చంట్స్, సీడ్స్‌ ఫెర్టిలైజర్‌ డీలర్స్‌ అసోసియేషన్లు, లయన్స్‌ క్లబ్, రోటరీక్లబ్‌ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల మద్దతు కోసం కూడా గులాబీదళం ప్రయత్నా లు సాగిస్తోంది. నిర్మాణ కార్మికులు, హమాలీ సంఘాలు, పారిశుధ్య కార్మికులు, అసంఘటిత రంగాల వారిని సైతం వదిలిపెట్టలేదు. 

అంతా తానై..! 
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ నుంచి నిష్క్రమించిన తర్వాత హుజూరాబాద్‌లో పార్టీ కేడర్‌ చేజారకుండా మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కూడిన యాక్షన్‌ టీమ్‌కు కేసీఆర్‌ బాధ్యతలు అప్పగించారు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడకముందు కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలను టీఆర్‌ఎస్‌లోకి రప్పించడం, నామినేటెడ్‌ పదవులు ఇవ్వడం వంటివి కేసీఆర్‌ కనుసన్నల్లో జరిగింది.

అయితే నియోజకవర్గస్థాయిలో టీఆర్‌ఎస్‌ కేడర్‌ సమన్వయం, ఇతర పార్టీల నుంచి కొద్దిపాటి పేరున్న నాయకులు, కార్యకర్తలను కూడా టీఆర్‌ఎస్‌ గూటికి చేర్చడంలో హరీశ్‌రావు క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ప్రచారం పూర్తయ్యేందుకు మరో పక్షం రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున సామాజికవర్గాలవారీగా మరింత పట్టు బిగించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. 

మరిన్ని వార్తలు