టీఆర్‌ఎస్‌: తెరపైకి నామినేటెడ్‌ పదవులు

7 Feb, 2021 10:22 IST|Sakshi

సంస్థాగత నిర్మాణంపై టీఆర్‌ఎస్‌ నేతల కసరత్తు

గ్రామ, మండల, జిల్లా కమిటీలపై అభిప్రాయ సేకరణ

త్వరలో సభ్యత్వ డ్రైవ్‌.. ఆ తర్వాత కమిటీలు

నేడు హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులు, నేతలతో కేసీఆర్‌ కీలక భేటీ

ఉమ్మడి వరంగల్‌ సీనియర్‌ నేతలకు అధిష్టానం పిలుపు 

సాక్షి, వరంగల్‌ :  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఈక్రమంలో మళ్లీ జిల్లా కమిటీలను వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీతో పాటు అన్ని అనుబంధ కమిటీలను పునరుద్ధరించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా భారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలన్న సంకేతాలు కూడా పార్టీ శ్రేణులకు చేరినట్లు సమాచారం. వీటిపై సమాలోచనలు చేసేందుకు పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్‌ ఆదివారం హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, సీని యర్లకు శుక్రవా రం సమాచారం అందింది. ఈ సమావేశంలో ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించేలా గ్రామ, మండల, జిల్లా కమిటీల పునరుద్ధరణతో పాటు సభ్యత్వ నమోదు అంశాలను చర్చించే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 

సంస్థాగత సందడి
అధికార టీఆర్‌ఎస్‌లో ఇంతకాలం ఏ పదవీ లేకుండానే కొనసాగుతున్న పలువురు సీనియర్‌ నేతలను త్వరలోనే పదవులు వరించనున్నాయి. కొంతకాలంగా ప్రభుత్వ నామినేటెడ్, సంస్థాగత పదవులను ఆశిస్తున్న నాయకులు అటు అడగలేక, ఇటు నిలదీయ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్‌ తదితర పదవులను ఆశించి.. అవి దక్కకపోవడంతో హామీలు పొందిన సీనియర్లు అధినేత ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగిన వారు, ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారు నామినేటెడ్, సంస్థాగత పదవులు ఎప్పుడెప్పుడు వరి స్తాయా అని ఎదురుచూస్తున్నారు.

గులాబీ దళనేత, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు వి విధ రాజకీయ పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన పలువురికి పదవుల్లేక రాజకీయ నిరుద్యోగులుగా మారామన్న అభిప్రాయంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలు, ఎంపీ, ఉప ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, ఆర్టీసీ సమ్మె, మున్సిపల్‌ ఎన్నికలు, కోవిడ్‌... ఇలా అనే క అవాంతరాలు ఏర్పడటంతో పార్టీ అధినాయకత్వం పదవుల భర్తీపై అంతగా దృష్టి పెట్టలేదన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్న కీలక సమావేశంలో తీసుకునే నిర్ణయాలతో పదవుల భర్తీకి మళ్లీ మోక్షం కలగవచ్చన్న చర్చ జరుగుతోంది.  

తెరపైకి నామినేటెడ్‌ పదవులు
పదవీకాలం పూర్తయిన చాలా నామినేటెడ్‌ పోస్టుల భర్తీ పెండింగ్‌లో పడగా.. పార్టీ పదవుల ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్‌ పోస్టులు పొందిన పలువురి పదవీకాలం ముగిసిపోయి నెలలు దాటింది. ఉమ్మడి జిల్లా నుంచి వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి మినహా ఎవరికీ మళ్లీ ఛాన్స్‌ రాలేదు. ట్రైకార్‌ చైర్మన్‌ గాంధీనాయక్, మహిళా అర్థిక సంస్థ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, ఆగ్రోస్‌ చైర్మన్‌ లింగంపల్లి కిషన్‌రావు, గొర్రెల పెంపకందారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బొల్లం సంపత్‌కుమార్, ఖాదీ గ్రామీ ణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ యూసుఫ్‌ జాహేద్‌ పదవీకాలం ముగిసిపోయింది.

గతేడాది ఉమ్మడి వరంగల్‌లో 12 నియోజకవర్గాల్లో పార్టీ సభ్య త్వ నమోదు పూర్తయినా జిల్లా కమిటీల ఊసులేకపోగా చాలా వరకు గ్రామ, మండలాలతో పాటు పట్టణ / నగర కమిటీలు సైతం పెండింగ్‌లో పెట్టారు. వాటి స్థానంలో పార్టీ నియోజకవర్గ కమిటీలను వేశారు. ఈ కమిటీల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి అంతగా ప్రయోజనం లేకపోగా, సంస్థాగత కమిటీలు లేని లోటు పలు సందర్భాల్లో కనిపించింది. దీంతో ఈసారి గ్రామ, మండల కమిటీలతో పాటు జిల్లా కమిటీలు, వాటి అనుబంధ సంఘాలను ఎన్నుకునే యోచన చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కీలక సమావేశం జరుగుతుండగా, త్వరలోనే పదవులు భర్తీ అవుతాయన్న ఆశాభావం పార్టీవర్గాల్లో వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు