ఏడాది పొడవునా తెలంగాణ విలీన వజ్రోత్సవాలు!

3 Sep, 2022 04:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూకుడుకు చెక్‌పెట్టే దిశలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. నాటి హైదరాబాద్‌ సంస్థానంలో భాగమైన తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమై వచ్చే 17వ తేదీకి 74 ఏళ్లు గడిచి 75వ ఏట ప్రవేశిస్తున్న తరుణంలో ఏడాది పొడవునా తెలంగాణ విలీన వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. శనివారం జరగనున్న మంత్రిమండలి భేటీలో.. దీనిపై తుది నిర్ణ యం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ నిర్వహించినట్లు.. తెలంగాణ వజ్రోత్సవాలు నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు చాటేలా కార్యక్రమాల నిర్వహణపై కేబినెట్‌ భేటీలో చర్చించి విధి విధానాలు ఖరారు చేసే అవకాశముంది.

సీబీఐకి నో ఎంట్రీ.. 
తెలంగాణలో సీబీఐ విచారణలకు ఫుల్‌స్టాప్‌ పెట్టా లని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కూడా కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో విచారించేందుకు వీలుగా సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతులు ఉపసంహరించుకోవడం కేబినెట్‌ ఎజెండాలో ఉండనుందని అధికార వర్గాల సమాచారం. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఇటీవల బిహార్‌ రాజధాని పట్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించిన నేపథ్యంలో.. అనుమతి ఉత్తర్వులను ఉపసహరించుకుంటున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఉద్యో గ నోటిఫికేషన్ల జారీ లో పురోగతి, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, ధరణి సమస్యలు, వాయిదా పడిన రెవెన్యూ సదస్సుల నిర్వహణ, విద్యుత్‌ బకాయిల చెల్లింపుపై కేంద్రం ఆదేశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశాలపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. 

గంటల వ్యవధిలో కీలక సమావేశాలు! 
రాష్ట్ర మంత్రివర్గం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశం జరగనుంది. ఇక మరో రెండురోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇలావుండగా మంత్రివర్గ భేటీతో పాటు టీఆర్‌ఎస్‌ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశంపై రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అందుకే ఒకేరోజు కేబినేట్‌ భేటీ, టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ లెజిస్లేచర్, పార్లమెంటరీ పార్టీల భేటీకి హాజరు కావాల్సిందిగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులకు ఆహ్వానం అందింది.

కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఈ భేటీలో తెలియజేయడంతో పాటు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించే అవకాశముందని తెలుస్తోంది. అదే సమయంలో జాతీయ పార్టీ ఏర్పాటు కు సంబంధించి కేసీఆర్‌ కీలక ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు 57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేసిన నేపథ్యంలో, నియోజకవర్గాల్లో అర్హులందరికీ చేరేలా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కేసీఆర్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ ఓటు బ్యాంకులో కీలకమైన ఆసరా పింఛన్‌ లబ్ధి దారుల అభిమానం చూరగొనేలా క్షేత్ర స్థాయిలో విస్తృత పర్యటనలు చేయాల్సిందిగా ఆదేశించనున్నారు.  

15 వరకు అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి భేటీ ఈ నెల 6న ఉదయం 11.30 గం.కు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు శుక్రవారం ప్రకటించారు. శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమవుతాయి. సమావేశాల ఎజెండాపై 6న జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు ఈ నెల 15వ తేదీ వరకు జరిగే అవకాశముందని సమాచారం.

మరిన్ని వార్తలు