రూ.80 కోట్లతో కొనుగోలుకు టీఆర్‌ఎస్‌ నిర్ణయం 

30 Sep, 2022 04:17 IST|Sakshi

దసరా రోజున ఆర్డర్‌ ఇవ్వనున్న పార్టీ 

అదే రోజు టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో జాతీయ పార్టీ ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దేశ వ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేక విమానం (చార్టర్డ్‌ ఫ్లైట్‌) కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. దసరా రోజున ఈ మేరకు ఆర్డర్‌ ఇచ్చే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. 12 సీట్ల సామర్ధ్యం కలిగిన ఈ విమానం కొనుగోలుకు పార్టీ రూ.80 కోట్లు ఖర్చు చేయనుంది.

ఈ మొత్తాన్ని విరాళాల ద్వారా సేకరించాలని నిర్ణయించగా, విరాళాలు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విమానం అందుబాటులోకి వస్తే దేశంలోనే సొంతగా ప్రత్యేక విమానం కలిగిన పార్టీగా టీఆర్‌ఎస్‌కు గుర్తింపు దక్కనుంది. పార్టీ ఖజానాలో రూ.865 కోట్ల మేర నిధులు ఉన్నాయి. అయినా విమానం కొనుగోలుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త పార్టీ పేరును ప్రకటించిన తర్వాత విమానానికి ఆర్డర్‌ ఇచ్చే అవకాశముంది. 

దసరాకే కొత్త పార్టీ ముహూర్తం 
జాతీయ పార్టీ పేరుపై కొన్ని సాంకేతిక అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించి దసరా రోజునే స్పష్టత ఇవ్వాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. అక్టోబర్‌ 5న టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం భేటీ ఏర్పాటు చేసి కొత్త పార్టీ ప్రకటనతో పాటు జాతీయ పార్టీ ప్రస్థానానికి సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ను ప్రకటించే అవకాశముంది.

ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పాటు ప్రకటన ఏ తరహాలో ఉండాలనే అంశంపై కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 5న జరిగే సమావేశానికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒకటి రెండురోజుల్లో అధికారికంగా సమాచారం అందించే అవకాశముంది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలోనే యాదాద్రి, భద్రకాళి ఆలయాల సందర్శనకు కేసీఆర్‌ వెళ్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.   

మరిన్ని వార్తలు