శ్రీనివాస్‌ చనిపోయాడు.. 

24 Aug, 2020 09:54 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌(సిరిసిల్ల): ఆ కుటుంబం పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. తమ సీనయ్య వస్తాడంటూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన తల్లి, భార్యాబిడ్డలకు కన్నీరే మిగిలింది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, తంగళ్లపల్లి గ్రామ అధ్యక్షుడు జంగపెల్లి శ్రీనివాస్‌(33) గత ఆదివారం సిద్దిపేట జిల్లా బద్దిపడిగె వాగులో కారుతో సహ గల్లంతైన విషయం తెలిసిందే. గాలింపు చర్యలు వారం రోజులపాటు నిరాటంకంగా కొనసాగగా, శనివారం నంగునూరు మండలం దర్గపల్లి వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన స్థానికులకు చెక్‌ డ్యామ్‌ సమీపంలోని చెట్లపొదల్లో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.

మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి శ్రీనివాస్‌గా గుర్తించారు. మృతి వార్త తెలియగానే తల్లి సత్తవ్వ, భార్య మానస గుండెలుపగిలేలా రోదించారు. శ్రీనివాస్‌ మరణవార్త విని మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. అంత్యక్రియల్లో సెస్‌ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు బొల్లి రాంమోహన్, ఎస్సై అభిలాష్, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు కృతిక, లాస్య, సోదరుడు శేఖర్‌ ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు