‘హుజూరాబాద్‌’ను గెలిచి తీరాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ పావులు

4 Aug, 2021 01:59 IST|Sakshi

చేరికలకు ప్రోత్సాహం, నేతలకు నామినేటెడ్‌ పదవులు

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు అందరినీ కలిసేలా వ్యూహం

16న లక్ష మందితోసీఎం సభ కోసం కసరత్తు

దళిత బంధు ప్రారంభంతో జోరు పెంచనున్న శ్రేణులు

సాక్షి, హైదరాబాద్‌: బరిలో బలమైన నేత.. గతంతో పోలిస్తే జోరుమీదున్న విపక్షాలు.. హోరాహోరీ పోరు ఖాయమనే సంకేతాలు.. ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ గెలుపు వ్యూహాలకు పదును పెడుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో జరగనున్న హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పావులు కదుపుతోంది. ఈ నెల 16న నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభ ద్వారా ఎన్నికల వేడిని మరింత రాజేయాలనుకుంటోంది. సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు హుజూరా బాద్‌ సభకు హాజరవుతుండటంతో రాబోయే 10 రోజుల్లో నియోజకవర్గంపై పట్టు బిగించేందుకు సమాయత్తమవుతోంది. దళితబంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో కేసీఆర్‌ ప్రారంభిస్తుండటంతో బహిరంగ సభకు భారీ జన సమీకరణ ద్వారా సత్తా చాటాలని గులాబీ దళం తహతహలాడుతోంది.

నేతలంతా బిజీబిజీ: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఇన్‌చార్జిగా పార్టీ నేతలు, యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సభ నిర్వహణ తీరుపై ఇప్పటికే మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలసి ప్రణాళిక రచించారు. మరోవైపు సుమారు 3 నెలల క్రితం నుంచే హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, మండ లాలవారీగా పార్టీ ఇన్‌చార్జిలు పనిచేస్తున్నారు.

హుజూరాబాద్‌కు సిద్దిపేట నేతలు...
గతంలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా అనుసరించిన వ్యూహాన్ని హుజూరాబాద్‌లోనూ టీఆర్‌ఎస్‌ అనుసరిస్తోంది. హుజూరాబాద్‌లో పార్టీ యంత్రాంగాన్ని ఇప్పటికే ఇన్‌చార్జీల ద్వారా చేతుల్లోకి తీసుకున్న టీఆర్‌ఎస్‌... పొరుగు జిల్లా నేతలు, క్రియాశీల కార్యకర్తలను కూడా భాగస్వాములను చేస్తోంది. నియోజకవర్గంలోని ప్రతి ఓటరునూ కలిసేందుకు వంద మందికి ఒకరు చొప్పున ఇన్‌చార్జిలను నియమించింది. పొరుగునే ఉన్న సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గ ముఖ్య నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో తాజాగా మంత్రి హరీశ్‌రావు కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం సిద్దిపేట జిల్లా నేతలు, క్రియాశీల కార్యకర్తలు బుధవారం హుజూరాబాద్‌ తరలివెళ్లారు. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు బేరీజు వేసి నివేదించడంతోపాటు స్థానిక నేతల నడుమ సమన్వయం, ప్రచారం తదితర బాధ్యతలు కూడా ఈ బృందం నిర్వర్తించాల్సి ఉంటుంది. 

చేరికల కార్యక్రమం కొలిక్కి...
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నిష్క్రమణకు ముందే నియోజకవర్గంలోని పార్టీ యంత్రాంగం చేజారకుండా చర్యలు చేపట్టిన టీఆర్‌ఎస్‌... ఆ తర్వాత స్థానికంగా ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించింది. నియోజకవర్గానికి చెందిన బలమైన విపక్ష నేతలను పార్టీ గూటికి తేవడంపై దృష్టి సారించింది. నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కాంగ్రెస్‌ నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, కష్యప్‌రెడ్డి వంటి నేతలను పార్టీలో చేర్చుకోగా ఈటల వెంట బీజేపీలో చేరిన ఆయన ముఖ్య అనుచరులు సమ్మిరెడ్డి, దేశిని స్వప్న కోటి వంటి వారు కూడా తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ నేతలను ఉప ఎన్నిక ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు స్థానిక నేత బండా శ్రీనివాస్‌ను ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేశారు. 

బీసీ అభ్యర్థికే టికెట్‌...
నియోజకవర్గంలోని సామాజిక వర్గాలవారీగా ఓటర్ల సంఖ్యపై అవగాహనకు వచ్చిన టీఆర్‌ఎస్‌... ఇప్పటికే ఆయా సామాజికవర్గాలతో ప్రత్యేక భేటీలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ మచ్చిక చేసుకుంటోంది. ఎస్సీ, రెడ్డి సామాజికవర్గ నేతలకు నామినేటెడ్‌ పదవులు అప్పగించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌... హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, ఇటీవల పార్టీలో చేరిన స్వర్గం రవి తదతరుల పేర్లు పరిశీనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక తరహాలోనే ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాతే పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. 

ఏకతాటిపైకి తెచ్చే లక్ష్యం...
పార్టీ యంత్రాంగంపై పట్టు సాధించడం, ఇతర పార్టీల నుంచి చేరికల నేపథ్యంలో ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడే నాటికి అందరినీ ఏకతాటిపైకి తేవడాన్ని టీఆర్‌ఎస్‌ తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది.

లబ్ధిదారుల చెంతకు..
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరినీ కలసి హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా టీఆర్‌ఎస్‌ బృందాలు ప్రచారం చేయనున్నాయి.

క్రియాశీల పాత్ర...
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్, రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు తదితరులు హుజూరాబాద్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

వంద మందికి ఒకరు...
నియోజకవర్గంలోని ప్రతి ఓటరునూ కలిసేందుకు వంద మందికి ఒకరు చొప్పున ఇన్‌చార్జిలను టీఆర్‌ఎస్‌ నియమించింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు