నో క్లారిటీ: దూరంగా ఉంటే పోలా?

13 Feb, 2021 08:48 IST|Sakshi

హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’లో పోటీపై టీఆర్‌ఎస్‌ మల్లగుల్లాలు

మాజీఎమ్మెల్సీ నాగేశ్వర్‌కు పరోక్ష మద్దతివ్వాలని నిర్ణయం?

2009లోనూ ఇదే చేసిన టీఆర్‌ఎస్‌ ఓటరు నమోదు

సమన్వయంపైనా మొదటి నుంచీ అస్పష్ట వైఖరి

పోటీ చేయాలా? వద్దా? అనే దానిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత

సాక్షి, హైదరాబాద్‌: రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఒకదాంట్లో పోటీకి దిగకపోవడమే మంచిదని టీఆర్‌ఎస్‌ నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది. శాసనమండలిలో మార్చి 29న ఖాళీ అయ్యే రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఈ నెల 16న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, మార్చి 14న పోలింగ్‌ అదే నెల 17న ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే. ‘వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’నియోజకవర్గం అభ్యర్థిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఒకటి రెండు రోజుల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసేదీ, లేనిదీ చెప్తామని పార్టీ కీలక నేతలు చెప్తున్నా, ఈ దఫా పోటీకి దూరంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

2007, 2009, 2015లో మూడు దఫాలు ఈ స్థానానికి ఎన్నిక జరగ్గా 2009లో టీఆర్‌ఎస్‌ పార్టీ పోటీకి దూరంగా ఉంది. 2007, 2015లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో ఓటరు నమోదు ప్రక్రియ ఆరంభ దశలో హడావుడి చేసిన టీఆర్‌ఎస్‌ ఆ తర్వాత ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’ పట్టభద్రుల నియోజకవర్గం ఊసెత్తడం లేదు. అయితే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ మినహాయించి... స్వతంత్రుడిగా పోటీ చేసే ఓ బలమైన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు మద్దతు ఇచ్చే అవకాశముందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 
చదవండి: ఎమ్మెల్సీ పోరు: ఓటు నమోదుకు ఇదే చివరి అవకాశం!

సమీక్షలో జోరు... ఆపై తగ్గిన దూకుడు
గత ఏడాది అక్టోబర్‌లో శాసనమండలి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా, ఈ ఏడాది జనవరి 22న తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. మండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ఓటరు నమోదు కీలకం కావడంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఇతర రాజకీయ పక్షాలు, సంస్థల కంటే ముందుగానే అప్రమత్తమైంది. ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కాకమునుపే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ కూడా ఓటరు నమోదుపై సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఒక్కో డివిజన్‌ నుంచి కనీసం మూడు వేల మంది గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయాలని కార్పొరేటర్లకు లక్ష్యం నిర్దేశించారు. ఎమ్మెల్సీ శేరి సుభా‹Ùరెడ్డికి ఈ నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్‌ ఓటర్ల సభ్యత్వ నమోదు పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. తర్వాతి కాలంలో ఓటరు నమోదు, మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయం వంటి అంశాల్లో టీఆర్‌ఎస్‌ దూకుడును తగ్గించింది. కాగా ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 5.17 లక్షలకు చేరింది. 

ఔత్సాహికుల ఆశలపై నీళ్లు 
‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం నాలుగో పర్యాయం ఎన్నిక జరుగుతుండగా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించలేదు. 2007లో పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందగా, 2009లో పోటీకి దూరంగా ఉండి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతునిచ్చింది. ఆయన గెలిచారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో జరిగిన ఎన్నికలో టీఎన్జీవోస్‌ యూనియన్‌ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ను ఉద్యోగానికి రాజీనామా చేయించి టీఆర్‌ఎస్‌ తరపున బరిలోకి దింపినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీఎస్‌ఎడబ్ల్యూడీసీ చైర్మన్‌ నాగేందర్‌ గౌడ్, పీఎల్‌ శ్రీనివాస్, శుభప్రద్‌ పటేల్‌ తదితరులు ఆసక్తి చూపుతున్నా పోటీకి దూరంగా ఉండాలని పార్టీ భావిస్తోంది. దీంతో పార్టీ సూచించిన అభ్యరి్థకి మద్దతు ఇవ్వాలంటూ ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’జిల్లాల పరిధిలోని కీలక నేతలు సంకేతాలు ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు