మానవత్వం చాటుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

5 May, 2022 19:19 IST|Sakshi
క్షతగాత్రులను ఆటోలో ఆస్పత్రికి పంపిస్తున్న ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌  

అర్వపల్లి (నల్గొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని అటుగా వెళ్తున్న తుంగతుర్తి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ గమనించి అప్పటికప్పుడు కారు, ఆటో ఏర్పాటు చేసి ఆస్పత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. సూర్యాపేట–జనగామ 365బీ జాతీయ రహదారిపై జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం వద్ద బుధవారం సూర్యాపేట నుంచి అర్వపల్లి వైపు వస్తున్న ఆటో, అర్వపల్లి నుంచి కుంచమర్తికి వెళ్తున్న బైక్‌ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై, ఆటోలో ప్రయాణిస్తున్న మేడి వినయ్, ఆకారపు మహేష్, మనుబోతుల నాగరాజు, కల్లెం సంతోష్, పత్తెపురం ముత్తమ్మ గాయపడ్డారు.

కాగా మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అదే సమయంలో ఆ రోడ్డు గుండా వెళ్తూ క్షతగాత్రులకు చూసి వెంటనే ఆగారు. తన వాహన శ్రేణిలోని కారుతో పాటు మరో ఆటోలో క్షతగాత్రులను సూర్యాపేట జిల్లా జనరల్‌ ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్సై మహేష్‌ తెలిపారు.


ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌  

మరిన్ని వార్తలు