టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చడం హాస్యాస్పదం: ఉత్తమ్‌

13 Jun, 2022 03:34 IST|Sakshi

అనంతగిరి: టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చాలనుకోవడం హాస్యాస్పదమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమారెడ్డి అన్నారు. రైతుభరోసా యాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా అనంత గిరి మండలంలో ఆదివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమా ల్లో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా లోక్‌సభలో 542 ఎంపీ స్థానాలుంటే.. తెలంగాణలో 16 లేదా 17 స్థానాలకు పోటీ పడుతున్న కేసీఆర్‌ జాతీయ స్థాయి అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు.

రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రెండు లేదా మూడు ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని.. వాటితో జాతీయ పార్టీగా రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారని ప్రశ్నించారు. జాతీయ పార్టీ విధివిధానాలపై కనీస అవగాహన లేకుండా కేసీఆర్‌ మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చాలని భావించినా అది పెద్దగా సాధ్యపడదన్నారు. రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారని ఉత్తమ్‌ హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు