ఎంపీ స్కూటీపై వెళ్లి.. బాధితులకు అండగా.. 

6 Jun, 2021 07:20 IST|Sakshi
స్కూటర్‌పై వెళ్తున్న ఎంపీ కవిత

సాక్షి, మహబూబాబాద్‌ /బయ్యారం: అటవీ ప్రాంతాల్లో కరోనాతో బాధపడుతున్న గిరిజనులకు ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే బానోతు హరిప్రియ అండగా నిలిచారు. మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం అటవీ ప్రాంతాల్లో శనివారం కవిత, హరిప్రియతో కలసి పర్యటించారు. మండలంలోని గురిమెళ్ల, గౌరారం, బాలాజీపేట పంచా యతీల్లో కరోనా బాధితులను వారు పరామర్శించి 158 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు.

కొన్ని ప్రాంతాలకు పెద్ద వాహనాలు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో ఎంపీ స్కూటర్‌పై, ఎమ్మెల్యే బైక్‌పై ప్రయాణించడం విశేషం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బాధితులు అధైర్యపడొద్దని సూచించారు. పౌష్టికాహారం తీసుకుంటూ, వైద్యులు సూచించిన మందులు వాడితే త్వరగా కోలుకోవచ్చని అన్నారు.

బైక్‌పై ఎమ్మెల్యే బానోతు హరిప్రియ

పిల్లల్లో కోవిడ్‌–19పై ఆందోళన వద్దు 
సాక్షి, హైదరాబాద్‌: పిల్లల్లో కోవిడ్‌ వ్యాప్తి గురించి ఆందోళన చెందవద్దని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. కరోనా పరిస్థితులపై శనివారం ఆమె ఉన్నతాధికారులు, జిల్లా సంక్షేమాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో మహిళలు, యువకులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారన్నారు. మూడో దశ పిల్లలపై అధిక ప్రభావం చూపే అవకాశాలున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇలాంటి ప్రచారాలను చూసి ఆందోళన చెందవద్దని, పిల్లలు కోవిడ్‌ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించేలా సిద్ధం చేయాలని, మాస్కు ధరించడం, శానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌ వినియోగించి చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో కూడా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పొషకాహారాన్ని అందిస్తున్నారని మంత్రి వారిని అభినందించారు.
చదవండి: జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో..  ‘పది పడకల ఐసీయూ’లు 

మరిన్ని వార్తలు