దాడి.. వేడి: చెప్పుతో కొడతానన్న కవిత.. దీటుగా స్పందించిన అర్వింద్‌

19 Nov, 2022 01:11 IST|Sakshi

ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అర్వింద్‌ వ్యక్తిగత వ్యాఖ్యలు 

ప్రతిగా ఆయన ఇంటిపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడి .. ఉద్రిక్తత 

అర్వింద్‌కు ఫోన్‌ చేసి ఆరా తీసిన అమిత్‌ షా 

కోర్టుకు వెళతామన్న ప్రహ్లాద్‌.. నివేదిక కోరిన గవర్నర్‌

రాష్ట్రంలో మళ్లీ మొదలైన రాజకీయ యుద్ధం!

భవిష్యత్‌ పరిణామాలపై చర్చ

సాక్షి, హైదరాబాద్‌:  కారు, కమలం పార్టీల మధ్య రాజకీయ రగడ ముదిరి పాకాన పడుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం పరా­కాష్టకు చేరుతోంది. రెండు ప్రధాన పార్టీల మధ్య గొడవలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. నువ్వా? నేనా? అన్నట్టుగా తలపడుతున్నా­యి. ఎమ్మెల్సీ కవితనుద్దేశించి నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, శుక్రవారం ఆయన నివాసంపై గులాబీ దళం దాడికి దిగడం, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతానని, కొట్టి కొట్టి సంపుతం అంటూ అర్వింద్‌పై కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఎక్కడ పోటీ చేసినా వెంట పడి ఓడిస్తానని కవిత పేర్కొనగా, ‘తగ్గేదేలే..’ అన్నట్టుగా తాను మళ్లీ నిజామాబాద్‌లోనే పోటీ చేస్తానని, దమ్ముంటే ఓడించాలంటూ ధర్మపురి సవాల్‌ చేశారు.

అర్వింద్‌కు మద్దతుగా బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు రంగంలోకి దిగారు. ఆయన ఇంటిపై దాడిని ఖండించారు. టీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి విమర్శలు గుప్పించారు. అండర్‌ గ్రౌండ్‌ చీఫ్‌ మినిస్టర్‌ అని, కుటుంబ పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా అర్వింద్‌ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అర్వింద్‌ ఇంటిపై దాడి జరగడాన్ని డీకే అరుణ, బండి సంజయ్‌లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అర్వింద్‌కు ఫోన్‌ చేసిన అమిత్‌ షా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు పలుచోట్ల కవిత దిష్టిబొమ్మలు దహనం చేశారు.

దాడి ఘటనపై కోర్టుకు వెళతామని ప్రహ్లాద్‌ జోషి చెప్పగా, దీనిపై తనకు సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆదేశించడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్‌ నేతలు కూడా బీజేపీపై విమర్శల దాడికి దిగారు. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్‌ మాత్రం..ఇదంతా టీఆర్‌ఎస్, బీజేపీల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకేనని విమర్శిస్తోంది. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక ముగియడంతో కొన్నాళ్లు ప్రశాంత వాతావరణం నెలకొంటుందని అంతా భావించారు. కానీ మాటల తూటాల దశ దాటి దాడుల వరకు వెళ్లడం, మళ్లీ రాజకీయ యుద్ధం మొదలవడంతో.. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి: బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి.. ధర్మపురి అర్వింద్‌ తల్లి ఫిర్యాదు

మరిన్ని వార్తలు