రైతులూ.. డోంట్‌‘వరీ’

9 Apr, 2022 02:32 IST|Sakshi

వానాకాలం వరిసాగుపై ఆంక్షల్లేవ్‌: వ్యవసాయ శాఖ 

కేంద్రం నిర్దేశించిన దానికంటే తక్కువ దిగుబడి వస్తుండటంతో నిర్ణయం...

రారైస్‌తో ఇబ్బంది ఉండదని, సొంత అవసరాలకు నిల్వ చేసుకోవచ్చనే యోచన  

పత్తి, కంది పంటలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌:  వచ్చే వానాకాలం సీజన్‌లో వరి పండించే విషయంలో రైతులపై ఎలాంటి ఆంక్షలు విధించేది లేదని వ్యవసాయ శాఖ తేల్చిచెప్పింది. ఈ యాసంగిలో మాదిరి వచ్చే వానాకాలంలో ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది. ప్రతి ఏటా వానాకాలంలో వరి 40 లక్షల ఎకరాలకు మించొద్దని చెప్పే వ్యవసాయ శాఖ ఇప్పుడు ఇలా పేర్కొనడం గమనార్హం.

వ్యవసాయ శాఖ చెప్పినా.. గతేడాది వానాకాలంలో ఏకంగా 61.75 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో భాగంగా 25 లక్షల ఎకరాల్లో సన్నాలు వేసిన రైతులు అధిక వానలతో దిగుబడి రాక పంట నష్ట పోయారు. ఇలా వానాకాలం పంటలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కంటే తక్కువగా మార్కెట్‌కు వస్తుండడంతో వ్యవసాయ శాఖ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అంతే కాకుండా వానాకాలంలో పండే రారైస్‌తో సమస్య ఉండదని, చాలావరకు సొంత అవసరాలకే నిల్వ చేసుకునే వీలుంటుందనే ఉద్దేశంతో.. వానాకాలంలో సాగుపై ఆంక్షలు విధించ కూడదని నిర్ణయించింది. అయితే అదే సమయంలో వరిసాగును ప్రత్యేకంగా ప్రోత్సహించబోమని కూడా చెబుతోంది. ఇదే విషయాన్ని రైతులకు తెలియజేయాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించింది.  

కంది, సోయా విస్తీర్ణం కూడా.. 
ఇక కంది సాగును కూడా రెట్టింపు చేయాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. కంది పంటను కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో కందిని మరింత విస్తరించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక సోయా పంట విస్తీర్ణం కూడా పెంచే అవకాశముంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల్లో సోయా సాగు జరుగుతుంది. అయితే విత్తనాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారుతోంది. విత్తనాలకు గత రెండేళ్లుగా ప్రభుత్వం రాయితీని ఎత్తివేసింది. ఈ ఏడాది కూడా రాయితీ ఉండబోదని అధికారులు చెబుతున్నారు.  

80 లక్షల వరకు ఎకరాల్లో పత్తిసాగు
వచ్చే వానాకాలం పంటల సాగుపై కసరత్తు చేపట్టిన వ్యవసాయ శాఖ.. ఏ పంటలు ఎంత వేయాలన్న దానిపై ఇప్పటికే స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. వరి, పత్తి తదితర పంట క్లస్టర్లను ఏర్పాటు చేసింది. దాదాపు 2,600 క్లస్టర్లు నెలకొల్పింది. ఆ మేరకు విత్తనాలు, ఎరువుల నిల్వలు తదితర అంశాలపై దృష్టి పెట్టింది. పత్తి, కంది పంటలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆ మేరకు విత్తనాలు సిద్ధం చేయాలని కంపెనీలను ఆదేశించింది. పత్తి కనీసం 75–80 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా ప్రోత్సహిస్తారు. వరి పండే చోట్ల పత్తి పండదు.

కానీ కాల్వ చివరి భూముల్లో మాత్రం వేయొచ్చు. అటువంటి చోట్ల పత్తిని ప్రోత్సహిస్తారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్కెట్‌లో పత్తి ధర పలుకుతోంది. ఇప్పటివరకు ఉన్న రికార్డులు తిరగరాస్తూ క్వింటాలుకు గరిష్టంగా రూ.12 వేలు దాటింది. అంతకుముందు ఏడాది పత్తి 60 లక్షల ఎకరాలకు పైగా సాగు చేయగా, గతేడాది వానాకాలం సీజన్‌లో కేవలం 46.25 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. అయితే పత్తి ఎంత సాగైనా కేంద్రంతో కొనిపించేందుకు అవకాశం ఉంది. పైగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా భారీగా డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో పత్తి రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించింది.

మరిన్ని వార్తలు