పంచాయతీల్లోనూ టీఎస్‌–బీపాస్‌

20 Jul, 2021 01:26 IST|Sakshi

అక్రమ లేఅవుట్ల నియంత్రణకు ప్రభుత్వ నిర్ణయం 

టీఎస్‌–బీపాస్‌ ద్వారానే కొత్త లేఅవుట్లకు అనుమతులు  

పంచాయతీరాజ్‌ శాఖకు ప్రభుత్వం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతుల జారీ కోసం అమలు చేస్తున్న ‘టీఎస్‌–బీపాస్‌’విధానాన్ని ఇకపై గ్రామ పంచాయతీల పరిధిలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీల్లో అక్రమ, అనధికార లేఅవుట్లు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనకు రావడంతో, వాటిని కఠినంగా నియంత్రించడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల్లో కొత్త లేఅవుట్ల అనుమతులు టీఎస్‌–బీపాస్‌ ద్వారానే జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇటీవల మెమో జారీ చేశారు. పంచాయతీల్లో లేఅవుట్ల అనుమతులకు ప్రస్తుతం అమలు చేస్తున్న డీపీఎంఎస్, ఈ–పంచాయతీ విధానాన్ని టీఎస్‌–బీపాస్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. 

జాప్యం చేసే అధికారులపై జరిమానాలు 
టీఎస్‌–బీపాస్‌ విధానం కింద భవనాలు, లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, ఇతర ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయని అధికారులపై జరిమానాలు విధించనున్నారు. జరిమానాల విధింపు త్వరలోనే అమల్లోకి రానున్నట్లు పురపాలక శాఖ టీఎస్‌–బీపాస్‌ పోర్టల్‌లో ప్రకటించింది.   

అక్రమ లేఅవుట్లకు 2 నెలల సమయం 
టీఎస్‌–బీపాస్‌ చట్టం మేరకు లేఅవుట్ల అనుమతులకు వచ్చే ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా లేఅవుట్‌ కమిటీ ముందు పెడతారు. ఈ కమిటీ సిఫారసుల మేరకు సంబంధిత గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పేరు మీద అనుమతులు జారీ చేయనున్నారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న అక్రమ లేఅవుట్లపై జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌ (డీటీఎఫ్‌) కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఏర్పాటైన అక్రమ లేఅవుట్లకు నోటీసులు జారీ చేసి టీఎస్‌–బీఎస్‌ కింద రెండు నెలల్లోగా క్రమబద్ధీకరణ/అనుమతులు తీసుకునేలా ఆదేశించాలని, విఫలమైన పక్షంలో చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్క్వాడ్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు అక్రమ లేఅవుట్ల తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్లను కోరింది. 

మరిన్ని వార్తలు