టీఎస్‌–బీపాస్‌ పోర్టల్‌లో వాటి అనుమతులపై నిషేధం

13 Nov, 2020 03:15 IST|Sakshi

దరఖాస్తుకు లేఅవుట్‌ అనుమతి/ఎల్‌ఆర్‌ఎస్‌ పత్రాలు తప్పనిసరి

షరతులతో 150 చదరపు మీటర్లలోని ప్లాట్లకు మినహాయింపు 

పాత/కొత్త పురపాలికల్లో 2015/2018లోగా రిజిస్టరైతేనే వర్తింపు

ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి గడ్డుకాలమే..

అనుమతి లేకుండా నిర్మిస్తే వారంలోగా నోటీసు లేకుండా కూల్చివేత

సాక్షి, హైదరాబాద్ ‌: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌)లో పేర్కొన్నట్టే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ, అనధికార ప్లాట్లలో భవన నిర్మాణ అనుమతుల జారీకి చెక్‌ పెట్టింది. అప్రూవ్డ్‌ లేఅవుట్లలోని ప్లాట్లు లేదా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరించిన ప్లాట్లలో మాత్రమే ఇళ్లు, భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసేలా టీఎస్‌–బీపాస్‌ పోర్టల్‌ను రూపకల్పన చేసింది. లేఅవుట్‌ అనుమతి పత్రం/ఎల్‌ఆర్‌ఎస్‌ సర్టిఫికెట్‌ను దరఖాస్తుతో పాటు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే ఇంటికి అనుమతులు జారీ కానున్నాయి. లేకుంటే దరఖాస్తు తిరస్కరణకు గురికానుంది.

అయితే, 150 చదరపు మీటర్లలోపు ఉన్న ప్లాట్లకు షరతులతో కూడిన మినహాయింపు కల్పించింది. పాత పురపాలికల్లో 2015 అక్టోబర్‌ 28 కంటే ముందు, కొత్త మున్సిపాలిటీల్లో 2018 మార్చి 28 కంటే ముందు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న 150 చదరపు మీటర్లలోపు విస్తీర్ణం గల ప్లాట్లకు మాత్రమే ఈ మినహాయింపు వర్తించనుంది. మరోవైపు అనుమతి తీసుకోకుండా చేపట్టే భవన, లేఅవుట్లను నోటీసులు లేకుండా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు కూల్చివేస్తాయని టీఎస్‌–బీపాస్‌ చట్టంలో ప్రభుత్వం పొందుపర్చింది. దీంతో అనుమతి లేని, క్రమబద్ధీకరించుకోని ప్లాట్లలో ఇళ్లను నిర్మించడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ నిర్మించినా, ఎవరైనా టీఎస్‌–బీపాస్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి వారం రోజుల్లో కూల్చివేయనున్నారు. 

మరి పేదల పరిస్థితేంటి? 
ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు అక్టోబర్‌ 31తో ముగిసిపోగా, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో 4,16,155 దరఖాస్తులు, మున్సిపాలిటీల పరిధిలో 10,60,013, గ్రామ పంచాయతీల పరిధిలో 10,83,394.. మొత్తం 25,59,562 దరఖాస్తులు వచ్చాయి. క్రమబద్ధీకరణ చార్జీలు, ఖాళీ స్థలాలు లేనందుకు చెల్లించాల్సిన జరిమానాలు కలిపి రూ.వేల నుంచి రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉండడంతో లక్షల మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకోలేకపోయారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ కింద అనధికార లేవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోని పక్షంలో వాటిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు జారీ చేయమని, ఆయా ప్లాట్ల క్రయావిక్రయాలకు రిజిస్ట్రేషన్లు జరపబోమని, సాధారణ నల్లా, డ్రైనేజీ కనెక్షన్లు జారీ చేయమని ప్రభుత్వం ఆగస్టు 31న జారీ చేసిన ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోలో పేర్కొంది. తాజాగా టీఎస్‌–బీపాస్‌ పోర్టల్‌ ద్వారా అనధికార లేఅవుట్లలో భవన నిర్మాణ అనుమతల జారీపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకోలేకపోయిన పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశముంది. 

ఉచిత క్రమబద్ధీకరణే పరిష్కారం..
ఎల్‌ఆర్‌ఎస్‌ కింద అనూహ్యంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం అక్టోబర్‌ 31 తర్వాత గడువు పొడిగించొద్దని నిర్ణయం తీసుకుంది. కొద్దో గొప్పో ఆర్థిక స్తోమత ఉన్న వాళ్లు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకోగా, ఏ మాత్రం ఫీజులు భరించలేని పేద, మధ్యతరగతి ప్రజలు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో ఆయా వర్గాల ప్రజలకు సంబంధించిన ప్లాట్లను ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరిస్తేనే వారు భవిష్యత్తులో ఇళ్లను నిర్మించుకోవడానికి అవకాశం కలగనుంది. ఈ విషయంపై ఇప్పటికే సీఎం కె.చంద్రశేఖర్‌రావు పరిశీలన జరుపుతున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

పేదలకు ఊరట కలిగే విధంగా నిర్దిష్ట విస్తీర్ణంలోని అనధికార ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాబోతుండటంతో అంతకుముందే దీనిపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. లేకుంటే క్రమబద్ధీకరించుకోలేకపోయిన పేదలు తమ సొంత ఖాళీ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకునే హక్కును, అవకాశాన్ని కోల్పోనున్నారు.

ఇది మానవ హక్కుల ఉల్లంఘనే..
‘ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరించుకోని స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా ఖజానాను నింపుకోవడానికి ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ తెచ్చింది. క్రమబద్ధీకరించుకోకుంటే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వబోమని, రిజిస్ట్రేషన్లు జరపమని ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోలో పెట్టిన కఠిన నిబంధనలు పూర్తిగా పేద, మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వం తమకు తోచినప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ను తెచ్చి తాము చెప్పిన గడువులోగా క్రమబద్ధీకరించుకోవాలంటే అందరికీ సాధ్యమవుతుందా..?

ఆ సమయంలో అందరి వద్ద డబ్బులుంటాయా..? ఇప్పటికే లాక్‌డౌన్, కరోనాతో ఉద్యోగాలు, వ్యాపారాలు దెబ్బతిని ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఎల్‌ఆర్‌ఎస్, టీఎస్‌–బీపాస్‌ పేరుతో ఇలాంటి ఆంక్షలు విధిస్తే ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత చూడక తప్పదు. తక్షణమే పేద, మధ్య తరగతి ప్రజల స్థలాలను ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా క్రమబద్ధీకరించి ఇళ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించాలి..'
– సంజీవ్, పేదల గృహ నిర్మాణ రంగ కార్యకర్త, మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌)

మరిన్ని వార్తలు