ఇంటి నుంచే ఓటేయొచ్చు.. ఖమ్మంలో ప్రయోగాత్మకంగా ‘ఈ ఓటింగ్‌’

7 Oct, 2021 10:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ సంక్షోభం ప్రపంచాన్ని డిజిటల్‌ ఆధారిత కార్యకలాపాలకు నెట్టివేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ‘ఈ ఓటింగ్‌’విధానాన్ని అభివృద్ధి చేసింది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసిన స్మార్ట్‌ ఫోన్‌ ఆధారిత ఈ ఓటింగ్‌ విధానాన్ని ఇప్పటికే ఎస్‌ఈసీ పరీక్షించింది. క్షేత్రస్థాయిలో దీనిని ప్ర యోగాత్మకంగా పరీక్షించేందుకు ఖమ్మం జిల్లాను ఎంపిక చేసింది.

‘టీఎస్‌ఈసీ ఈఓట్‌’గా పిలిచే ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత యాప్‌ ద్వారా ఈ నెల 8 నుంచి 18 వరకు ఆసక్తి ఉన్న ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఖమ్మం జిల్లాలోని ఓటర్లందరూ ఈ ప్రయోగంలో భాగస్వాములు అయ్యేందుకు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదైన ఓటర్లు అదే ఫోన్‌ నంబరు ద్వారా 20న జరిగే నమూనా ఓటింగ్‌లో పాల్గొనాలి. 
చదవండి: తెలంగాణపై ఫ్రెంచ్‌ ఫోకస్‌.. మరో అద్భుత అవకాశం

ఎమర్జింగ్‌ టెక్నాలజీ సాయంతో ‘ఈ ఓటింగ్‌’ 
రాష్ట్ర ఐటీ శాఖకు చెందిన ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వింగ్, సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సిడాక్‌) భాగస్వామ్యంతో ఎస్‌ఈసీ ‘ఈ ఓటింగ్‌’విధానాన్ని అభివృద్ధి చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతిక సలహాదారు, ఐఐటీ భిలాయ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రజత్‌ మూనా నేతృత్వంలోని ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్లతో కూడిన నిపుణుల బృందం నూతన ఓటింగ్‌ విధానానికి సాంకేతిక మార్గదర్శనం చేసింది. దివ్యాంగులు, వయోవృద్ధులు, అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారు, అనారోగ్యంతో బాధపడేవారు, పో లింగ్‌ సిబ్బంది, ఐటీ నిపుణులు తదితర వర్గాల కో సం ‘ఈ ఓటింగ్‌’విధానం అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఎస్‌ఈసీ ఈ యాప్‌ను రూపొందించింది. 
చదవండి: చోరీ మామూలే..కానీ ఈ దొంగకు ఓ ప్రత్యేకత ఉంది

ఏఐ, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ సాయంతో.. 
ఓటర్లను గుర్తించేందుకు కృత్రిమ మేథస్సు (ఏఐ), వేసిన ఓట్లను భద్రపరచడం, తారుమారు కాకుండా చూసేందుకు బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత ఆధారంగా యాప్‌ పనిచేస్తుంది. ఆధార్‌ కార్డులోని పేరుతో ఓటరు పేరు సరిచూడటం, ఎన్నికల సంఘం డేటా బేస్‌తోని ఫొటోతో ఓటరు ఫొటోను సరిచూడటం వంటి వాటిలో ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఓటర్లు సులభంగా ఈ యాప్‌ను ఉపయోగించేలా తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఉంటుంది. యాప్‌ను ఎలా ఉపయోగించాలో ఓటర్లకు తెలియజేసేందుకు ఈ యాప్‌లో వీడియోలు, హెల్ప్‌లైన్‌ నంబర్లు కూడా ఉంటాయి.   

మరిన్ని వార్తలు