తెలంగాణ ఎంసెట్ 2021‌ షెడ్యూల్‌ విడుదల

12 Feb, 2021 17:46 IST|Sakshi

జూన్‌ 20 నుంచి పీజీఈసెట్‌.. జూలై 1న ఈసెట్‌

ఉన్నత విద్యామండలి చైర్మన్‌  ప్రొఫెసర్‌ పాపిరెడ్డి

మరో నాలుగు సెట్స్‌ తేదీలు త్వరలో ఖరారు

అన్ని సెట్స్‌కు కన్వీనర్ల నియామకం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) తేదీలు ఖరార య్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్‌  ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి ఆయా తేదీలను శుక్రవారం ప్రకటించారు. ప్రధానమైన ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్‌ బీఈ/బీటెక్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవే శాల కోసం ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు తెలి పారు. మరోవైపు పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీఈ/బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (ల్యాటరల్‌ ఎంట్రీ) ఈసెట్‌ను జూలై 1వ తేదీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

వాస్తవానికి జూన్‌  14వ తేదీ తరువాత ఎప్పుడైనా సెట్స్‌ను నిర్వహించేందుకు ఉన్నత విద్యా మం డలి సిద్ధంగా ఉన్నా, ఆన్‌లైన్‌  పరీక్షలను నిర్వ హించే సాంకేతిక సంస్థ అయిన టీసీఎస్‌ ఖాళీ స్లాట్స్‌ జూన్‌ లో ఎక్కువగా లేకపోవడం, పైగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరమ్యే ఎంసెట్‌ పరీక్ష లను నిర్వహించేందుకు టీసీఎస్‌కు జూన్‌ లో సిబ్బంది కొరత ఉంటుందనే కారణంతో జూలై లోనే నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడిం చారు. అయితే తక్కువ మంది విద్యార్థులు హాజ రయ్యే పీజీఈసెట్‌ను జూన్‌  20 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎంఈ/ఎంటెక్‌/ఎంఫార్మసీ/ఫార్మ్‌–డి(పీబీ), మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో దీని ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా అనేక ఆన్‌లైన్‌  పరీక్షలను నిర్వహిస్తున్న టీసీఎస్‌ ప్రతినిధులతో చర్చించి, ఖాళీగా ఉన్న స్లాట్స్‌లో సెట్స్‌ తేదీలను ఖరారు చేసినట్లు వెల్లడించారు. అలాగే అన్ని సెట్స్‌కు నిర్వహణ యూనివర్సిటీలను, కన్వీనర్లను నియమించినట్లు తెలిపారు.

70 శాతం సిలబస్‌తో ఎంసెట్‌
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 70% సిలబస్, ‘ప్రథమ’లో పూర్తి సిలబస్‌తో ఎంసెట్‌ను నిర్వహి స్తామన్నారు. ఇప్పటికే ఈ నిర్ణయం జరిగినందున ఇంటర్‌బోర్డు కూడా సిలబస్‌ను, మోడల్‌ ప్రశ్నా పత్రాలను అందుబాటులో ఉంచిందన్నారు. ఎంసెట్‌ పేపరు సెట్టింగ్‌ సమయంలో ఆ సిలబస్‌నే పరిగణనలోకి తీసుకుంటారని వెల్లడించారు. సిలబస్‌ వివరాలను కూడా ఎంసెట్‌ నోటిఫికేషన్‌  సమయంలో వెబ్‌సైట్‌లో ఎంసెట్‌ కమిటీ అందుబాటులో ఉంచుతుందని వివరించారు. ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వారం, పదిరోజుల్లో జారీ అయ్యే అవకాశం ఉంది.

జూలై చివర్లో లేదా ఆగస్టులో...
మరో నాలుగు సెట్స్‌ తేదీలను ఇంకా ఖరారు చేయలేదని పాపిరెడ్డి తెలిపారు. వాటిని జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌సెట్, 3 ఏళ్లు, 5 ఏళ్ల న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు లాసెట్, డిప్లొమా ఇన్‌  ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌  (డీపీఈడీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌  (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్‌ తేదీలను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు.

సాధారణ పరిస్థితుల్లో మార్చిలో ఇంటర్‌ పరీక్షలు, ఏప్రిల్‌లో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలు జరిగేవన్నారు. వాటి ప్రకారం మే నెలలో ఎంసెట్, ఇతర సెట్స్‌ నిర్వహించే వారిమన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆ పరీక్షలన్నీ రెండు నెలలు ఆల స్యంగా నిర్వహించాల్సి వస్తోంద న్నారు. యూనివర్సిటీల్లో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షల తేదీలను ఇంకా ఖరారు చేయలేదని, ప్రస్తుతం ప్రత్యక్ష బోధన మొదలైనందున త్వరలోనే ఆయా పరీక్షల తేదీలు ఖరారు అవుతాయన్నారు. వాటిని బట్టి ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్‌ పరీక్షల తేదీలను ఖరారు చేస్తామని వివరించారు. 

చదవండి:

బాబోయ్‌... ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు

ఆపిల్‌ కంప్యూటర్‌ ఖరీదు రూ.11కోట్లు?

మరిన్ని వార్తలు