TS EAMCET Exam 2022: ఎంసెట్‌ వాయిదా..!

11 Jul, 2022 03:45 IST|Sakshi

భారీ వర్షాల నేపథ్యంలో నేడు నిర్ణయం తీసుకోనున్న ఉన్నత విద్యామండలి 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ, వైద్య, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీఎస్‌ ఎంసెట్‌) విషయమై అధికారులు తర్జనభర్జన పడుతు­న్నారు. అనూహ్యంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఎడతెరిపిలేని వర్షాల దృష్ట్యా ఎంసెట్‌ను వాయిదా వేసే యోచనలో ఉన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఉన్నత విద్యామండలి సోమవారం భేటీ కానుంది.

క్షేత్రస్థాయి పరిస్థితులు, వాతావరణ శాఖ నివేదిక ఆధారంగా వాస్తవ­పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించాలని అధికారులు భావిస్తున్నారు. ఎంసెట్‌ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే, తాజాగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రవాణా స్తంభించింది.

చాలా ప్రాంతాలు జలమయ మయ్యాయి. విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు వెళ్లడం కూడా కష్టమేనని ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చారు. ప్రభుత్వం కూడా రాష్ట్రంలో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. అనేకచోట్ల విద్యుత్‌ సరఫరాకు, ఇంటర్నెట్‌ సదుపాయానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరీక్షాకేంద్రాల్లో కూర్చునే పరిస్థితి కూడా లేదని అధికారులు చెబుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని ఎంసెట్‌ను వాయిదా వేయడమే సరైనదని అధికారులు భావిస్తున్నారు.

కొంత సమయం ఇద్దామా?
ఈసారి ఎంసెట్‌కు కూడా విపరీతమైన పోటీ ఉందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌కు 1,71,945, అగ్రికల్చర్, మెడికల్‌కు 94,150, రెండింటికీ దరఖాస్తు చేసినవారు 350, మొత్తం 2,66,445 దరఖాస్తులు వచ్చినట్టు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువ వచ్చాయని అధికారులు వెల్లడించారు.

ఈ నెల 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్, 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్‌ విభాగంలో ఎంసెట్‌ చేపట్టాల్సి ఉంది. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్న కారణంగా విద్యుత్, ఇంటర్నెట్‌ సదుపాయాలు తప్పకుండా ఉండాల్సిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రెండు మౌలిక సదుపాయాలకు అంతరాయం ఏర్పడుతోంది. బేటరీలు, ఇన్వర్టర్లు, జనరేటర్ల సాయంతో పరీక్షలు నిర్వహించినా, చాలామంది విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవడమే కష్టంగా ఉందని అంటున్నారు. పరీక్షల కోసం ఏపీ, తెలంగాణలో 109 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా పరిస్థితి ప్రతికూలంగానే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 

పరిస్థితిని అంచనా వేసి నిర్ణయిస్తాం
రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎంసెట్‌ నిర్వహణ సాధ్యమా? కాదా? అన్న విషయాన్ని సోమవారం చర్చిస్తాం. అన్ని ప్రాంతాల్లో పరిస్థితిని 
అంచనా వేసి ఓ నిర్ణయానికి వస్తాం. ఎంసెట్‌ నిర్వహణకు సిద్ధంగానే ఉన్నాం. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ప్రభుత్వ సలహా తీసుకుంటాం. 14వ తేదీ నాటికి పరిస్థితులన్నీ సక్రమంగా ఉంటే, పరీక్ష నిర్వహణకు వెనుకాడబోం.  
– ప్రొఫెసర్‌ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ 

మరిన్ని వార్తలు