జూన్‌ మొదటి వారంలో ఎంసెట్‌! 

4 Mar, 2022 05:01 IST|Sakshi

తేదీలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు 

7వ తేదీ తర్వాత స్పష్టత! 

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌–2022పై ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలైంది. ఏ తేదీల్లో నిర్వహించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. 7వ తేదీన జరిగే సమావేశంలో చర్చ అనంతరం పరీక్ష తేదీలపై ప్రాథమిక అంగీకారానికి వచ్చే అవకాశం ఉందని ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. అనంతరం విషయం ప్రభుత్వానికి తెలియజేసి, అనుమతి వచ్చిన తర్వాత షెడ్యూల్‌ ప్రకటిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌ పరీక్షల తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్షలు మే నెలతో ముగుస్తాయి. మరోవైపు ఇంటర్మీడియట్‌ పరీక్షలు కూడా మే మొదటి వారంలో పూర్తవుతాయి. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని జూన్‌ మొదటి వారంలో ఎంసెట్‌ నిర్వహించే యోచనలో అధికారులున్నారు. నెల రోజుల్లో ఫలితాలు వెల్లడించాలని భావిస్తున్నారు.

జేఈఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ చేపట్టాలనే యోచనలో ఉన్నారు. తొలి విడతలో ఎంసెట్‌లో సీటు దక్కించుకున్న విద్యార్థులు ఆ తర్వాత ఎన్‌ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందుతారు. దీంతో రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కేటాయించిన సీట్లలో ఖాళీలు ఏర్పడతాయి. వీటన్నింటినీ జేఈఈ తుది రౌండ్‌ కౌన్సెలింగ్‌ తర్వాతే భర్తీ చేయాలని భావిస్తున్నారు.  

అభ్యర్థులు పెరిగే అవకాశం     
ఈసారి ఎంసెట్‌ రాసే అభ్యర్థుల సంఖ్యపై అధికారులు దృష్టి పెడుతున్నారు. గత రెండేళ్లుగా టెన్త్‌ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ ఇంటర్‌కు ప్రమోట్‌ చేశారు. ఇటీవల ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో కేవలం 49% విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు వీళ్లంతా ఇంటర్‌ సెకండియర్‌లో ఉన్నారు. ఏప్రిల్‌లో జరిగే ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలున్నాయి. అయితే ఈ ఫలితాలతో సంబంధం లేకుండానే ఎంసెట్‌ రాసే వీలుంది. దీంతో గతం కన్నా ఈసారి ఎంసెట్‌ రాసే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసే అంశంపైనా చర్చించనున్నారు. 

మరిన్ని వార్తలు