వచ్చే నెలలో ఎంసెట్‌!

10 Aug, 2020 01:40 IST|Sakshi

నేడు సెట్స్‌ తేదీలు ఖరారు చేయనున్నఉన్నత విద్యామండలి

ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై కసరత్తు

ఈనెలాఖరు నుంచి ఒక్కో సెట్‌ ప్రారంభం

వీలైతే ఈ నెలాఖరు నుంచి లేదా వచ్చే నెలలో ఎంసెట్‌

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. వచ్చే నెల ఒకటి నుంచి ఆరో తేదీ వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇప్పటికే షెడ్యూలును ఖరారు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ ప్రవేశ పరీక్షల నిర్వహణకు మండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 10న తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే గతంలో మాదిరిగా వరుసగా ప్రవేశ పరీక్షల నిర్వహణ ఈసారి సాధ్యమయ్యే పరిస్థితి లేదు. దీంతో పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్‌ ఖాళీ స్లాట్స్‌ను బట్టి పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటివరకున్న సమాచారం మేరకు ఈ నెల 14వ తేదీ వరకు టీసీఎస్‌ తేదీలు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు  ఈ నెల 18, ఆ తరువాత ఈ నెల 24వ తేదీ నుంచి స్లాట్స్‌ ఖాళీ ఉన్నాయి. అయితే ఈ నెల 14వ తేదీ వరకు పరీక్షల నిర్వహించే పరిస్థితి లేదు. 

సెట్స్‌ తేదీలను ప్రకటించిన తరువాత...
సాధారణంగా సెట్స్‌ తేదీలను ప్రకటించిన తరువాత కనీసంగా 10 నుంచి 15 రోజుల గడువును విద్యార్థుల ప్రిపరేషన్‌ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 వరకు పరీక్షల నిర్వహణ కష్టమే. వీలైతే ఈ నెల 24 నుంచి ఉండే స్లాట్స్‌లో ఎంసెట్‌ పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉంది. కుదరదనుకుంటే వచ్చే నెలలోనే ఎంసెట్‌ పరీక్షలను నిర్వహించే అవకాశముంది. మరోవైపు ఈ నెల 24 నుంచి 31 వరకు ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్‌ వంటి వాటిల్లో ఒకటీ రెండు పరీక్షలను నిర్వహించి వచ్చే నెల 6వ తేదీ తరువాత టీసీఎస్‌ స్లాట్స్‌ను బట్టి మిగతా పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంటుంది.

వచ్చే నెల మూడో వారంలో ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ తదితర ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో వచ్చే నెల రెండో వారంలో తెలంగాణ ఎంసెట్‌ను నిర్వహించేలా తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. టీసీఎస్‌ స్లాట్స్‌ కనుక వరుసగా ఖాళీ లేకపోయినా వేర్వేరు రోజుల్లోనూ పరీక్షలను నిర్వహించేలా ఉన్నత విద్యా మండలి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. ఈ పరీక్షల నిర్వహణ కోసం 4.60 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో సోమవారం నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశానికి మరోసారి టీసీఎస్‌ ప్రతినిధులను ఆహ్వానించి తేదీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తరువాత పరీక్షల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు