జనవరిలో ఎంసెట్‌ నోటిఫికేషన్‌!

20 Dec, 2022 02:33 IST|Sakshi

జేఈఈపై క్లారిటీ రావడంతో ముందడుగు 

ఇంటర్‌ పరీక్షలను బట్టి తేదీల ఖరారు 

ఈసారి ఇంటర్‌ వెయిటేజీ లేనట్టే 

45 రోజుల సమయం ఉండేలా ఉన్నత విద్యామండలి కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్స్‌ పరీక్షల తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించడం... ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదల కావడంతో తెలంగాణ ఎంసెట్‌ నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. 2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం మండలి అధికారులు త్వరలో సమావేశం కానున్నారు.

సాధ్యమైనంత వరకు ఎంసెట్‌ పరీక్ష మే రెండు, మూడు వారాల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంటర్‌ పరీక్షల తర్వాత ఎంసెట్‌ సన్నద్ధతకు కనీసం 45 రోజుల కాలపరిమితి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటర్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరుగుతాయి. ఈ లెక్కన మేలో ఎంసెట్‌కు అనువైన తేదీలను ఖరారు చేసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.

జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు జరుగుతాయి. రెండో విడత ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు ఉంటుంది. జేఈఈ పూర్తయిన తర్వాత కూడా ఎంసెట్‌కు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు సమయం దొరుకుతుంది. కోవిడ్‌ కారణంగా రెండేళ్లుగా ఎంసెట్‌ ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సకాలంలో విద్యా సంవత్సరం కొనసాగింది.

దీంతో జేఈఈ మెయిన్స్‌ కూడా గతం కన్నా ముందే పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ను త్వరగా నిర్వహించి జూన్‌లో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆగస్టు చివరి నాటికి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగించాలని యోచిస్తున్నారు. ఈసారి కూడా ఇంటర్‌ మార్కుల వెయిటేజీ లేనట్టేనని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు.  

మేలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 
ఇంటర్‌ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత నెల రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన వారికి, మార్కులు తక్కువగా వచ్చినవారికి మేలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫలితాలు ప్రకటించిన రోజే ఆయా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రాసే వారు కూడా ఎంసెట్‌ పరీక్షలు రాసేందుకు అర్హులే. 

ఏప్రిల్‌ మొదటి వారంలో టెన్త్‌ పరీక్షలు 
ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల కాగా, పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ మొదటివారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఇంటర్‌ ప్రధాన పరీక్షలు మార్చిలోనే ముగియనుండగా, ఏప్రిల్‌ మొదటి వారంలో టెన్త్‌ పరీక్షలను ప్రారంభించాలని ఎస్సెస్సీబోర్డు అధికారులు భావిస్తున్నారు. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోను ప్రభుత్వం జారీచేయాల్సి ఉంది. ఈ జీవో జారీ అయితేనే తుది షెడ్యూల్‌ ఖరారుచేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.   

మరిన్ని వార్తలు