ఇంజనీరింగ్‌ క్లాసులు ఇంకా ఆలస్యం 

12 Oct, 2021 01:54 IST|Sakshi

రెండో విడత కౌన్సెలింగ్‌ 20 తర్వాతే.. 

సీటు వదులుకునే తేదీ గడువూ పొడిగింపు

యాజమాన్య కోటాకు పెరుగుతున్న గడువు

కొత్త సీట్లపై క్లారిటీ ఇవ్వని జేఎన్‌టీయూహెచ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 20 తర్వాత మొదలయ్యే అవకాశముందని రాష్ట్ర సాంకేతిక విద్యామండలి వర్గాలు తెలిపాయి. షెడ్యూల్‌ త్వరలో ప్రకటిస్తామని, దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరోవైపు మొదటి కౌన్సెలింగ్‌లో సీటు దక్కిన విద్యార్థులు దాన్ని రద్దు చేసుకునే గడువును పొడిగించాలని మండలి నిర్ణయించింది. వీటితోపాటే యాజమాన్య కోటా సీట్ల భర్తీ గడువునూ పెంచనున్నట్టు తెలిసింది.

రెండో విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 15 నుంచే మొదలుపెట్టాలని నిర్ణయించినప్పటికీ దసరా నేపథ్యంలో తేదీని మార్చాలని యోచిస్తున్నారు. మరోవైపు కోర్టు ఆదేశంతో ఇంజనీరింగ్‌ సీట్ల పెంపుపై స్పష్టత కూడా రాలేదు. జేఎన్‌టీయూహెచ్‌ దీనిపై నిర్ణయం వెలువరిస్తే రెండో దశ కౌన్సెలింగ్‌లో 70 శాతం సీట్లు చేరాల్సి ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగా ఈబీసీ కోటా సీట్లు ఖరారు చేయాలి. వీటన్నింటికీ ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. ఈ ప్రక్రియ వల్ల మరికొంత జాప్యమయ్యే అవకాశముందని అధికారులు అంటున్నారు. 

జాతీయ సీట్లపైనా స్పష్టత 
తొలి విడత కౌన్సెలింగ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ, బయోటెక్నాలజీ తదితర గ్రూపులకు 61,169 సీట్లు కన్వీనర్‌ కోటా కింద కేటాయించారు. గడువు ముగిసే నాటికి 46,322 మంది సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారు. ఇంజనీరింగ్, సైన్స్‌ గ్రూపుల్లో 38,796 సీట్లుండగా.. 37,073 సీట్లు కేటాయించారు. కంప్యూటర్‌ సైన్స్‌ అనుబంధ గ్రూపుల్లో చాలామంది సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారు. జేఈఈ ర్యాంకుల ఆధారంగా రాష్ట్రం నుంచి ప్రతీ ఏటా 1,500 మంది వరకూ ఐఐటీ, జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లోకి వెళ్తున్నారు.

అయితే రెండో దశ కౌన్సెలింగ్‌ ఆలస్యం కావడం, నిట్, ఐఐటీ సీట్ల కేటాయింపులో స్పష్టత రావడంతో ఎన్ని సీట్లు ఖాళీ అవుతాయనేది తెలిసే వీలుందని అంచనా వేస్తున్నారు. దీనికితోడు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఏఐ అండ్‌ ఎంఎల్‌ వంటి కొత్త కోర్సుల్లో జేఎన్‌టీయూహెచ్‌ అనుమతి లేకుండానే సీట్ల పెంపుపై హైకోర్టు ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై యూనివర్సిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాక.. సర్కార్‌ అనుమతిస్తే మరో 4 వేల సీట్లు పెరిగే వీలుంది. ఇప్పటివరకైతే సీట్ల పెంపుపై జేఎన్‌టీయూహెచ్‌ విముఖంగా ఉంది.

నవంబర్‌ చివరినాటికైనా కష్టమే.. 
మొదటి ఏడాది ఇంజనీరింగ్‌ తరగతులు నవంబర్‌ మొదటి వారం నుంచి ప్రారంభించాలనుకున్నారు. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఎప్పటికప్పుడు మారుతోంది. యాజమాన్య కోటా భర్తీ వివరాలను ఈనెల 15లోగా పంపాలని ఆదేశించిన రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ మండలి.. ఈ గడువును పొడిగించే యోచనలో ఉంది. అదీగాక కోర్టు తీర్పు ద్వారా పెరిగే 30 శాతం సీట్ల వివరాలను నియంత్రణ మండలికి పంపాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికే నవంబర్‌ రెండో వారం పడుతుందని, ఈ ప్రకారం నవంబర్‌ చివరినాటికైనా క్లాసులు మొదలుకావడం కష్టమేనని ఓ అధికారి వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు