ఎక్కువ మంది కంప్యూటర్‌ సైన్స్‌ వైపే.. 

18 Sep, 2022 04:58 IST|Sakshi

ఈసెట్‌ తొలి విడతలో 89 శాతం సీట్ల భర్తీ  

సాక్షి, హైదరాబాద్‌: ఈసెట్‌ ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్‌ సెకండియర్‌లో 89 శాతం మందికి సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. తొలిదశ సీట్ల కేటాయింపు పూర్తి చేసినట్టు సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈసెట్‌ కౌన్సెలింగ్‌లోనూ కంప్యూటర్‌ సైన్స్, దాని అనుబంధ కోర్సులనే విద్యార్థులు ఎక్కువగా ఎంచుకున్నట్టు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 19,558 మంది ఈసెట్‌లో అర్హత సాధించగా తొలి దశ కౌన్సెలింగ్‌కు 13,429 మంది ఆప్షన్లు ఇచ్చినట్టు చెప్పారు.

రాష్ట్రంలో రెండో ఏడాదిలో ప్రవేశానికి 11,260 ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉండగా, 9,968 సీట్లు కేటాయించినట్టు తెలిపారు. ఫార్మసీలో 1,174 సీట్లు అందుబాటులో ఉంటే, 50 సీట్లు కేటాయించామన్నారు. సీట్లు దక్కించుకున్న అభ్య ర్థులు ఈ నెల 22లోగా ఆన్‌లైన్‌ చెల్లింపు ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని, వచ్చే నెల 10లోగా అన్ని ధ్రువపత్రాలతో కాలేజీలో నేరుగా రిపోర్టు చేయాలని తెలిపారు.

తొలి విడత కౌన్సెలింగ్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సీట్లు 19 భర్తీ అయ్యాయి. ఏఐఎంఎల్‌లో 127 సీట్లు ఉంటే, 105 కేటాయించారు. డేటాసైన్స్, సైబర్‌ సెక్యూరిటీ కోర్సుకు 80 శాతంపైనే ఆప్షన్లు ఇచ్చారు. కంప్యూటర్‌ సైన్స్‌లో 2,643 సీట్లు ఉంటే, 2470 సీట్లు కేటాయించారు. ఈసీఈలోనూ 2,060 సీట్లకు 1853 భర్తీ అయ్యాయి. ఈఈఈలో 1,096 సీట్లకు 1,066 కేటాయించారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 886 సీట్లకు 860, సివిల్‌ ఇంజనీరింగ్‌లో 905 సీట్లకు 900 కేటాయించారు.    

మరిన్ని వార్తలు