TS EDCET 2021: నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు

12 Jun, 2021 15:00 IST|Sakshi

బీబీఏ, బీసీఏ అభ్యర్థులూ బీఎడ్‌కు అర్హులు

బీటెక్‌ విద్యార్థులూ కోర్సులో చేరొచ్చు

ఓరియంటల్‌ విద్యార్థులకూ అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివిన వారు మాత్రమే బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్‌) చేరే అవకాశం ఉండగా ఇకపై ఇతర సబ్జెక్టులు చదివిన వారికి బీఎడ్‌లో చేరే అవకాశం వచ్చింది. ఈ మేరకు బీఎడ్‌ ప్రవేశాల నిబంధనలను ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా జీవో 16 జారీ చేశారు.

ఇప్పటివరకు డిగ్రీలో ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌ చదువుకున్న వారికి బీఎడ్‌లో చేరే అవకాశం లేకపోగా ఇప్పుడు వారికి కొత్తగా అవకాశం దక్కింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (హోంసైన్స్‌), బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌), బీబీఏ, బీటెక్‌ చేసిన వారు కూడా బీఎడ్‌ చదివే వీలు ఏర్పడింది. వారు ఆయా డిగ్రీల్లో 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.  

ఇవి చదివిన వారంతా అర్హులే.. 
► బీఎడ్‌ ఫిజికల్‌ సైన్స్‌ చేయాలంటే.. బీఎస్సీ విద్యార్థులు ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ లేదా సంబంధిత సబ్జెక్టును పార్ట్‌–2 గ్రూపులో చదివి ఉండాలి. బీటెక్‌ విద్యార్థులు ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ; బీసీఏ విద్యార్థులు ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ సబ్జెక్టులను ఇంటర్మీడియట్‌లో చదివి ఉంటే చాలు. 

► బీఎడ్‌ బయోలాజికల్‌ సైన్స్‌లో చేరాలంటే బీఎస్సీ/బీఎస్సీ (హోంసైన్స్‌) చేసిన వారు బోటనీ, జువాలజీలో ఏదో ఒక సబ్జెక్టు డిగ్రీలో పార్ట్‌–2 గ్రూపులో చదివి ఉండాలి. బీసీఏ విద్యార్థులైతే ఇంటర్‌లో బయోలాజికల్‌ సైన్స్‌ చదివి ఉండాలి.
 
► బీఎడ్‌ సోషల్‌ సైన్సెస్‌ చేయాలంటే బీకాం/బీబీఎం/బీబీఏ/బీసీఏ అభ్యర్థులు ఇంటర్‌లో సోషల్‌ సైన్స్‌ చదివి ఉండాలి.  

► ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌లో బీఎడ్‌ చేయాలనుకునే వారు బీఏలో తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్‌/సంస్కృతంను ఒక ఆప్షనల్‌ సబ్జెక్టుగా చదివి ఉండాలి. లిటరేచర్‌ అభ్యర్థులు (బీఏ–ఎల్‌) తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్‌/సంస్కృతం చదివి ఉంటే చాలు. బీఏ ఓరియెంటల్‌ లాంగ్వేజెస్‌ వారు తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్‌/సంస్కృతం చదివి ఉండాలి. ఎంఏ తెలుగు/ హిందీ/ మరాఠీ/ ఉర్దూ/ అరబిక్‌/ సంస్కృతం చేసిన వారు కూడా అర్హులే.   

చదవండి:
10 వేలకు పైగా ఉద్యోగాలు.. ఆశావహులకు తీపికబురు

NMDC Recruitment 2021: ఎన్‌ఎండీసీలో 89 పోస్టులు

మరిన్ని వార్తలు