జనవరి 18లోగా రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు 

9 Jan, 2022 03:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరం 2022–23కి బడ్జెట్‌ ప్రతిపాదనల అంచనాలను ఈ నెల 18లోగా సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ విభాగాలు అంచనాలను ఈ నెల 17లోగా సంబంధిత శాఖ కార్యదర్శికి సమర్పించాలని కోరింది. 2021–22కి సవరించిన బడ్జెట్‌ అంచనాలనూ సమర్పించాలంది. ఈ అంచనాల్లో కేటాయింపుల పెంపును అంగీకరించమని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులిచ్చారు. బడ్జెట్‌ అంచనాల సమర్పణలో జాప్యం ఉండొద్దని, జాప్యమైతే మార్పులకు సమయం లభించడం లేదన్నారు. గడువులోగా ప్రతిపాదనలు సమర్పించకుంటే సంబంధిత శాఖకు పథకాల అమలుకు ఆర్థిక శాఖ నిధులు కేటాయించదన్నారు. తదనంతర పరిణామాలకు సదరు శాఖదే బాధ్యతని చెప్పారు. ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌ ద్వారా బడ్జెట్‌  ప్రతిపాదనల స్వీకరణ  ప్రారంభమయింది.   

మరిన్ని వార్తలు