ఇళ్లకు డిజిటల్‌ డోర్‌ నంబర్లు

3 Feb, 2021 08:58 IST|Sakshi
క్యూఆర్‌ కోడ్‌తో డిజిటల్‌ డోర్‌ నంబర్‌

బండ్లగూడ 19వ డివిజన్‌లో ఏర్పాటు 

రాజేంద్రనగర్‌(హైదరాబాద్‌): నగరాలు, పట్టణాల్లో ఏదైనా ఇంటి చిరునామా కనుగొనాలంటే నానా తిప్పలూ పడాల్సిందే. ఈ సమస్యను అధిగమించేందుకు ఇళ్లకు డిజిటల్‌ నంబర్లు కేటాయించాలని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా సూర్యాపేట పట్టణాన్ని ఎంచుకొంది. ఇదే తరహాలో హైదరాబాద్‌కి ఆనుకొని ఉన్న బండ్లగూడలోని ఓ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్‌ సొంత నిధులతో ఇళ్లకు డిజిటల్‌ డోర్‌ నంబర్లు కేటాయిస్తున్నారు.  

క్యూఆర్‌ కోడ్‌లో వివరాలు..: బండ్లగూడ 19వ డివిజన్‌ కార్పొరేటర్‌గా నాగుల స్రవంతి ఉన్నారు. డివిజన్‌ పరిధిలోని బస్తీలు, కాలనీల్లో ఇళ్ల చిరునామాలు అస్తవ్యస్తంగా ఉండటంతో సమస్య ఎదురవుతున్నట్లు ఆమె గుర్తించారు. దీంతో ఇళ్లకు డిజిటల్‌ డోర్‌ నంబర్లు ఇచ్చేందుకు సొంత ఖర్చుతో పని మొదలుపెట్టారు. ఇప్పటికే 90 ఇళ్లకు కేటాయింపు పూర్తయ్యింది.

ప్రతి డిజిటల్‌ డోర్‌ నంబర్‌లోనూ క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. దీన్ని స్కాన్‌ చేస్తే ఇంటి యజమాని పేరుతో సహా చిరునామాను సులభంగా కనుక్కోవచ్చు. కాలనీలోని ప్లాట్‌ నంబర్‌నే డోర్‌ నంబర్‌గా రూపొందించారు. ఒక ప్లాట్‌ను ఇద్దరికి విక్రయించినా, అపార్ట్‌మెంట్‌ ఉన్నా బై నంబర్లు ఇస్తున్నారు. డిజిటల్‌ డోర్‌ నంబర్‌ను గూగుల్‌ మ్యాప్‌కు అనుసంధానించారు. దీని ద్వారా అడ్రస్‌ను కనుక్కోవచ్చు.  

డివిజన్‌లో ఇంటి అడ్రస్‌ కోసం పలువురు ఇబ్బందులకు గురవ్వడం చూశాను. డిజిటల్‌ డోర్‌ నంబర్లతో ఈ సమస్య పరిష్కరించవచ్చని గుర్తించాను. వెంటనే పని ప్రారంభించి ఇళ్లకు డిజిటల్‌ డోర్‌ నంబర్లు ఏర్పాటు చేయిస్తున్నా. దీనికోసం యాప్‌నూ అభివృద్ధి చేస్తున్నాం. 
– నాగుల స్రవంతి నరేందర్, కార్పొరేటర్‌  

డిజిటల్‌ డోర్‌ నంబర్‌ అన్ని విధాలుగా ఎంతో ఉపయోగం. ఈ విధానం విదేశాల్లో కొనసాగుతోంది. క్యూఆర్‌ కోడ్‌తో పాటు గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఎక్కడి నుంచైనా స్కాన్‌ చేసి నేరుగా ఆ ఇంటికి వచ్చేయవచ్చు. చిరునామా దొరకలేదనే సమస్యే ఉండదు. 
–శ్రీనివాస్, డిజిటల్‌ డోర్‌ నంబర్‌ రూపకర్త   

మరిన్ని వార్తలు