ఆస్తుల నమోదుకు వెబ్‌సైట్‌: సోమేశ్‌ కుమార్‌

18 Oct, 2020 03:50 IST|Sakshi

మీ–సేవ కేంద్రాల్లో ఉచిత నమోదుకు వెసులుబాటు  

సాక్షి, హైదరాబాద్‌: యజమానులే స్వయంగా వ్యవసాయేతర ఆస్తులు నమోదు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ (www.npb.telangana.gov.in) ను అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లోని వ్యవసాయేతర ఆస్తులను ఈ వెబ్‌సైట్‌లో యజమానులే నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. మీ–సేవ ద్వారా కూడా ఉచితంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మీ–సేవ కేంద్రాలకు చెల్లించాల్సిన చార్జీలను జీహెచ్‌ఎంసీ/పురపాలికలే చెల్లిస్తాయని చెప్పారు.

నకిలీ లావాదేవీలను నిర్మూలించేందుకు ఆధార్‌ నంబర్, యాజమాన్య హక్కులకు సంబంధించిన లావాదేవీలపై అప్రమత్తం చేసేందుకు మొబైల్‌ ఫోన్‌ నంబర్, ఆస్తులపై కుటుంబసభ్యుల హక్కులను పరిరక్షించేందుకు వారి వివరాలను, మెరూన్‌ రంగు పాసుబుక్‌పై ముద్రించేందుకు యజమాని ఫొటో, స్థలం విస్తీర్ణం/ నిర్మిత ప్రాంతం వివరాలను యజమాని పొందుపర్చాల్సి ఉంటుందని వివరించారు. ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐ), ఓసీలకు సంబంధించిన ఆస్తుల నమోదుకు త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. శనివారం నాటికి 75.74 లక్షల ఆస్తుల నమోదు పూర్తవుతుందని పేర్కొన్నారు. ఆస్తుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం ధరణి ప్రాజెక్టు తీసుకొస్తోందని, ఆస్తుల క్రయవిక్రయాలు జరిగిన వెంటనే మ్యూటేషన్లు జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.ఆస్తుల యజమానుల వివరాలను రహస్య (ఇన్‌క్రిప్టెడ్‌) కోడ్‌ భాషలో రాష్ట్ర ప్రభుత్వ సర్వర్లలో నిల్వ చేస్తామన్నారు. ఈ సమాచారాన్ని ధరణి అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని వివరించారు. 

25న ‘ధరణి’ ప్రారంభం: ఈ నెల 25న ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఆ రోజు నుంచి తహసీళ్లలో సాగు భూముల రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు మొదలవుతాయని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎస్, ధరణి నిర్వహణ, సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.    

మరిన్ని వార్తలు