‘ఎమర్జింగ్‌’పై దృష్టి

3 Aug, 2020 01:15 IST|Sakshi

నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

సాక్షి, హైదరాబాద్‌ : ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో కొత్తగా వస్తున్న సాంకేతికత (ఎమర్జింగ్‌ టెక్నాలజీ)ను అందిపుచ్చు కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీ రంగానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కార్యక లాపాల్లో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించు కోవాలని నిర్ణయించింది. ఎమర్జింగ్‌ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు 2016లో విడుదల చేసిన ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీలో పలు ప్రతిపాదనలు చేసింది. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), బ్లాక్‌ చెయిన్, డ్రోన్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), సైబర్‌ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీల వినియోగానికి ఉన్న అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

విభిన్న రంగాల్లో కృత్రిమ మేధస్సు...
2020ని కృత్రిమ మేథో సంవత్సరంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... ఏఐ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన పలు ప్రాజెక్టులను పాలన, పౌర సేవల్లో వినియోగిస్తోంది. మేడారం జాతరలో క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్, రిజిస్ట్రేషన్‌ కార్యాలయం చిరునామా పౌరులు తెలుసుకునేందుకు ‘మేధ’ చాట్‌బోట్‌ వంటివి ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని చేనేత, వస్త్ర పరిశ్రమలోనూ ఉపయోగించి నేత కార్మికులు, వినియోగదారులకు మేలు చేసే దిశగా ఓ ప్రాజెక్టు రూపొందుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత నిర్ధారణ, ట్రాఫిక్‌ నిర్వహణ వంటి రంగాల్లోనూ ఏఐ ఆధారంగా పలు ఆవిష్కరణల దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్‌ ప్రయత్నాలు చేస్తోంది.

బ్లాక్‌ చెయిన్‌తో పౌర సేవల్లో పారదర్శకత
ప్రభుత్వ, పౌర సేవల్లో పారదర్శకత, రక్షణ పెంపు లక్ష్యంగా బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత ప్రాజెక్టులు సుమారు పది వరకు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఆధారంగా భూ రికార్డులు తారుమారు చేయకుండా ‘సీడాక్‌’ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టు మంచి ఫలితాలు సాధించింది. చిట్‌ఫండ్‌ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు రూపొందించిన ‘టీ చిట్స్‌’ జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించింది. విద్యార్హత సర్టిఫికెట్లు, ఔషధాల్లో నకిలీల నివారణ, ప్రజాపంపిణీ వ్యవస్థ, న్యాయ వ్యవహారాలు, రవాణా, భూ రికార్డుల్లో పారదర్శకత వంటి రంగాల్లోనూ బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి.

మరిన్ని రంగాలకు డ్రోన్‌ టెక్నాలజీ విస్తరణ
డ్రోన్‌ల దిగుమతిలో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా ప్రస్తుతం నిర్మాణ, వ్యవసాయ, ఆరోగ్య, బీమా, సినిమాటోగ్రఫీ, పోలీసు తదితర రంగాల్లో డ్రోన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో అటవీ సంరక్షణ, మైనింగ్, వ్యవసాయ రంగాల్లో డ్రోన్‌ టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, అపోలో హాస్పిటల్స్‌ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై’ పేరిట దేశంలోనే తొలి డ్రోన్‌ టెక్నాలజీ ప్రాజెక్టును చేపట్టింది.

సైబర్‌ సెక్యూరిటీ.. ఈ–వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌
సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక, బ్యాంకింగ్, రక్షణ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులతోపాటు నేర పరిశోధనలో సైబర్‌ సెక్యూరిటీ టెక్నాలజీపై రాష్ట్రంలో ఇప్పటికే పలు ఆవిష్కరణలు జరుగుతున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీఎస్‌సీఐ) భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో రూ. 22 కోట్లతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటైంది. మరోవైపు ఈ–వేస్ట్‌ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్‌ ఐదో స్థానంలో ఉండటంతో ఈ రంగంలో ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఈ–వేస్ట్‌ నిర్వహణ తదితరాలకు సంబంధించి రూ. 36 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఎమర్జింగ్‌ టెక్నాలజీకి తెలంగాణ కేంద్ర బిందువుగా మారుతుండటంతో భవిష్యత్తులో ఉద్యోగాలు అవకాశాలు పెరుగుతాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు