వీకే సింగ్‌ వీఆర్‌ఎస్‌కు టీ సర్కార్‌ బ్రేక్‌

7 Oct, 2020 15:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినోయ్‌కుమార్‌ సింగ్‌(వీకే సింగ్‌) వీఆర్‌ఎస్‌కు తెలంగాణ సర్కార్‌ బ్రేక్‌ వేసింది. రెండు కేసుల్లో శాఖపరమైన పెండింగ్‌లో ఉన్న కారణంగా వీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు వీకే సింగ్‌కు ప్రభుత్వం తెలిపింది. కాగా జూన్‌ 26న వీకే సింగ్‌ వీఆర్‌ఎస్‌ అభ్యర్థన పెట్టుకున్నారు. అయితే వీకే సింగ్‌ పెట్టుకున్న వీఆర్‌ఎస్‌ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు అక్టోబర్‌ 2న తెలంగాణ సర్కార్‌ ఆయనకు నోటీస్‌ పంపించింది. ఈ ఏడాది నవంబర్‌ 30న వీకే సింగ్‌ సర్వీసు ముగియనుంది. అయితే తనకు అక్టోబర్‌ 2న ప్రీ రిటైర్‌మెంట్‌ ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు. జైళ్లశాఖ డీజీగా పనిచేసిన ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. (చదవండి : డీజీపీగా పదోన్నతి ఇవ్వకుంటే రాజీనామా)

అయితే కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదని ప్రభుత్వంపై కినుక వహించారు. తన సేవలకు తగిన గుర్తింపు లేదంటూ వీకే సింగ్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా వీకే సింగ్‌ తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే జూన్‌ 26న వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.  వీఆర్‌ఎస్‌ పెట్టుకున్న కొద్దిరోజుల్లోనే ఆయనను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. స్టేట్‌ పోలీస్‌ అకాడమీ నుంచి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలంటూ వీకే సింగ్‌కు అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. కానీ దీనికి ఒప్పుకోని వీకే సింగ్‌ రాజీనామాకు కూడా సిద్దపడ్డారు.

మరిన్ని వార్తలు