విద్యార్థులూ.. ఆత్మహత్యలు వద్దు 

24 Feb, 2023 01:30 IST|Sakshi
నిమ్స్‌లో ప్రీతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న గవర్నర్‌ తమిళిసై

ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండాలి 

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచన 

ఆత్మహత్యాయత్నం చేసిన వైద్య విద్యార్థినికి పరామర్శ

సాక్షి, హైదరాబాద్‌/లక్డీకాపూల్‌: ఏ సందర్భంలోనైనా విద్యార్థులు ధైర్యంగా ఉండాలని.. ఆత్మహత్యలకు పాల్పడటం సరికాదని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. సీనియర్‌ వేధింపులకు గురిచేశాడంటూ ఆత్మహత్యాయత్నం చేసి ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వరంగల్‌ ఎంజేఎం పీజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతిని, ఆమె కుటుంబసభ్యుల్ని గవర్నర్‌ గురువారం పరామర్శించారు.

బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ఇది చాలా సున్నితమైన అంశమని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలన్నారు. ఒక వైద్య విద్యార్థినికి ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. బాధితురాలిని కాపాడేందుకు అన్ని రకాల వైద్య సహాయం అందించాలని వైద్యుల్ని కోరినట్లు గవర్నర్‌ చెప్పారు. 

బాధ్యులెవరైనా వదలం: డీఎంఈ 
వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఉదంతంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులు ఎవరైనా వదిలేది లేదని రాష్ట్ర వైద్య, విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి పరిస్థితిని తెలుసుకోవడానికి ఆయన గురువారం నిమ్స్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీతి పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ఆత్మహత్యాయత్నానికి ఆమె ఇంజక్షన్‌ తీసుకోవడమే కారణమనే విషయాన్ని అప్పుడే నిర్ధారించలేమని, దానికి సంబంధించిన ఆనవాళ్లేవీ వైద్యులు ఇప్పటిదాకా గుర్తించలేదన్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణం ర్యాగింగ్‌ కాదని, పీజీ స్థాయిలో అప్పటికే వైద్యులుగా ఉన్న పరిస్థితిలో ర్యాగింగ్‌ ఉండదన్నారు. 

హోంమంత్రి బంధువనే చర్యలు తీసుకోలేదా?: విపక్షాలు 
పంజగుట్ట: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధరావత్‌ ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు పలు పార్టీలు, సంఘాల నాయకులు గురువారం నిమ్స్‌ ఆసుపత్రికి వచ్చారు. మాజీ మంత్రి రవీంద్రనాయక్, టీడీపీ నాయకురాలు జ్యోత్స్న, గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు వెంకట్‌ బంజారా, బీజేపీ మహిళా మోర్చా నాయకులు, సామాజిక కార్యకర్త ఇందిరా శోభన్‌ వచ్చి డాక్టర్‌ ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ హోంమంత్రి బంధువైనందుకే ప్రీతిని వేధించిన సీనియర్‌ విద్యార్థి సైఫ్‌పై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు వెనుకంజ వేస్తున్నారా? అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు