ఢిల్లీలో గవర్నర్‌ తమిళిసై

6 Apr, 2022 02:50 IST|Sakshi

అమిత్‌ షాతో నేడు భేటీ

సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేసే చాన్స్‌

పలు అంశాలపై కేంద్రానికి నివేదికలు?

రాష్ట్ర సర్కారు తీరుపై కొంతకాలంగా అసంతృప్తి

అమిత్‌ షా పిలుపుతోనే ఢిల్లీకి తమిళిసై!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో బుధవారం ఆమె సమావేశమయ్యే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. వాస్తవానికి సోమవారం రాత్రే గవర్నర్‌ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాలతో వా యిదా పడింది. అమిత్‌షా పిలుపు మేరకే తమిళిసై ఢిల్లీ వెళ్లారని సమాచారం. సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో ఉండగా గవర్నర్‌ కూడా ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 

గవర్నర్‌ వర్సెస్‌ సీఎం కేసీఆర్‌
గవర్నర్, సీఎం కేసీఆర్‌ మధ్య ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. బీజేపీ రాజకీయాలకు రాజ్‌భవన్‌ అడ్డాగా మారిందని, ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో గవర్నర్‌ మోకాలడ్డుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. పలు సందర్భాల్లో గవర్నర్‌ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని తప్పబట్టింది. మరోవైపు గవర్నర్‌గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనను ప్రభుత్వం గౌరవించడం లేదని, పలు సందర్భాల్లో అవమానాలు భరించాల్సి వచ్చిందని తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సమక్క–సారక్క జాతరలో పాల్గొనడానికి ములుగు జిల్లాకు వెళ్లిన గవర్నర్‌ను ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆహ్వానించడానికి రాకపోవడంపై ఫిర్యాదులు అందడంతో ఇప్పటికే కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సందర్శన కోసం వెళ్లిన గవర్నర్‌ను ఆహ్వానించడానికి జిల్లా కలెక్టర్, ఎస్పీలు, చివరకు ఆలయ ఈవో కూడా రాకపోవడాన్ని గవర్నర్‌ అవమానంగా భావించినట్టు తెలిసింది.

బడ్జెట్‌ సమావేశాల నుంచి ఉగాది వేడుక దాక..
గవర్నర్‌ ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించడాన్ని తమిళిసై బహిరంగంగా తప్పుబట్టారు. గణతంద్ర దినోత్సవ వేడుకలను రాజ్‌భవన్‌కు పరిమితం చేసి సాదాసీదా నిర్వహించడం సైతం గవర్నర్‌కు రుచించలేదు. తాజాగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులను ఆహ్వానించినా ఎవరూ హాజరవలేదు.

రాజ్‌భవన్‌ వ్యవహారాలతో ప్రభుత్వ యంత్రాంగం అంటిముట్టనట్టు వ్యవహరిస్తోందని గవర్నర్‌ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్‌ షాతో భేటీలో ఆమె ఈ అంశాలను ప్రస్తావించడంతో పాటు వీటిపై నివేదికలనూ సమర్పించనున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు