సత్తా చూసి ఎంపిక చేయండి

25 Oct, 2020 02:27 IST|Sakshi

 ‘కేంద్ర బల్క్‌డ్రగ్స్‌ పార్కు’ మార్గదర్శకాలపై రాష్ట్రం అభ్యంతరం

భూమి ధరలు, ప్రోత్సాహకాలతో ముడిపెట్టడంపై అసంతృప్తి

రాష్ట్రంలో బల్క్‌డ్రగ్స్‌ పార్కు ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నాలు

సాక్షి, హైదరాబాద్‌: బల్క్‌డ్రగ్స్‌ పార్కుల ఏర్పాటు విషయంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పార్కు ల ఏర్పాటులో కేవలం భూముల ధరలనే కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఔషధాల రంగంలో ఉన్న మౌలిక వసతులు, అనువైన వాతావరణాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని కోరుతోంది. బల్క్‌డ్రగ్స్‌ తయారీలో అత్యంత కీలకమైన యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌ (ఏపీఐ), ఇతర కీలక ముడి పదార్థాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు మూడు కొత్త బల్క్‌ డ్రగ్స్‌ పార్కులను(బీడీపీ) ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పార్కులను ఎక్కడ ఏర్పాటు చేయాలో సూచించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్స్‌ విభాగానికి(డీఓపీ) కేంద్రం బాధ్యత అప్పగిం చింది.

ఈ ఏడాది మార్చిలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 27న బీడీపీల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ చేస్తూ, ఆసక్తి కలి గిన రాష్ట్రాలు దరఖాస్తు చేసుకోవాలని సూచిం చింది. బీడీపీల ఏర్పాటుకు ఆసక్తి చూపే రాష్ట్రాల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. కేంద్ర పథకంలో భాగంగా ఒక్కో బీడీపీకి గరిష్టంగా రూ.వెయ్యి కోట్ల గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌తో పాటు 75 శాతం మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. అలాగే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. బీడీపీల ఏర్పాటుకు ఆసక్తి చూపే రాష్ట్రాలు అక్టోబర్‌ 15వ తేదీలోగా తమ ప్రతిపాదనలు అందజేసేందుకు డీఓపీ తుది గడువు విధిం చింది. దీంతో తెలంగాణ, ఏపీ, గుజరాత్, తమిళనాడు, పంజాబ్‌ ఆసక్తి చూపుతూ ప్రతిపాదనలు అందజేశాయి.

మార్గదర్శకాలపై అభ్యంతరం
బీడీపీలకు అవసరమైన భూమి ధరలు, విద్యుత్‌ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల వివరాలు సమర్పిస్తే, చాలెంజ్‌ మోడ్‌లో అర్హత కలిగిన రాష్ట్రాలను ఎంపిక చేస్తామని డీఓపీ ప్రకటించింది. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ.. రాష్ట్రాలు అందజేసే ప్రతిపాదనలను మదింపు చేసిన తర్వాత, ఏజెన్సీ చేసే సిఫారసు మేరకు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామని వెల్లడించింది. కాగా, కనీసం ఒక్క బీడీపీని అయినా సాధించాలనే పట్టుదలతో ఉన్న తెలంగాణ, బీడీపీల ఎంపిక కోసం రూపొందించిన మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేవలం భూమి ధరలు, రాయితీలు, ప్రోత్సాహకాలే కాకుండా ఇతర అంశాలు కూడా ఫార్మాపరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడకు లేఖ రాశారు.

బీడీపీల ఏర్పాటులో ప్రణాళిక, పర్యావరణ అనుమతులు వంటి అంశాలను కూడా ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోవాలని, ఈ విషయంలో ఆయా రాష్ట్రాల శక్తిసామర్థ్యాలను లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ కోరుతోంది. అలాగే ఏపీఐ, ఇతర కీలక ముడి పదార్థాల తయారీకి రాష్ట్రంలో ఉన్న అనువైన వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ప్రధాననగరాలకు దూరంగా 3 వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాల్లో భూమి ధరలు సహజంగానే తక్కువగా ఉంటాయనేది రాష్ట్రం వాదన. ఇలాంటి చోటకు నైపుణ్యం కలిగిన వారిని రప్పించడం, ఉద్యోగుల రవాణా, నివాసం తదితరాలు ఇబ్బందికరంగా ఉంటాయని, అలాగే అంతర్జాతీయ పెట్టుబడులు రావడం కష్టమని కేంద్ర మంత్రికి రాసినలేఖలో కేటీఆర్‌ పేర్కొన్నారు.

చైనా కీలకం.. 
భారత బల్క్‌డ్రగ్స్‌ తయారీ, ఎగుమతి రంగంలో తెలంగాణ కేంద్ర బిందువుగా ఉంది. బల్క్‌డ్రగ్స్‌ తయారీలో కీలకమైన యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్లు (ఏపీఐ), ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. వివిధ కారణాలతో ఏపీఐల రవాణాలో అంతరాయం ఏర్పడుతుండగా, కోవిడ్‌ నేపథ్యంలో ఏపీఐ, ఇతర కీలక ముడి పదార్థాల ధరలు 20 శాతం మేర పెరిగాయి. ఉత్పత్తి, రవాణా వ్యయం పెరగడంతో పాటు లాభాలపై ఏపీఐ దిగుమతులు ప్రభావం చూపుతున్నాయి. 

మరిన్ని వార్తలు