డీఏ పెంపు 5.24 శాతం 

24 Oct, 2020 01:40 IST|Sakshi

33.53 నుంచి 38.77 శాతానికి 

2019 జూలై 1 నుంచి పెంపు వర్తింపు  

నవంబర్‌ వేతనంతో డిసెంబర్‌ 1న చెల్లింపు  

పెన్షనర్లకు నాలుగు వాయిదాల్లో బకాయిలు

జీపీఎఫ్‌ ఖాతాలో పాత పెన్షన్‌ ఉద్యోగుల డీఏ బకాయిలు జమ 

సీపీఎస్‌ ఉద్యోగుల ప్రాణ్‌ ఖాతాకు 10 శాతం బకాయిలు 

మిగిలిన 90 శాతం 4 సమ వాయిదాల్లో చెల్లింపు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఆర్థికశాఖ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం 5.24 శాతం కరువు భత్యం(డీఏ) పెంచింది. తక్షణమే ఒక డీఏ చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో... ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూల వేతనంపై కరువు భత్యం 33.536 శాతం నుంచి 38.776 శాతానికి పెరిగింది. 2019 జూలై 1 నుంచి డీఏ పెంపు వర్తించనుంది. డిసెంబర్‌లో చెల్లించనున్న నవంబర్‌ వేతనం/ పెన్షన్‌తో కలిపి పెరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.  

బకాయిల చెల్లింపు ఇలా.. 
 2019 జూలై 1 నుంచి 2020 అక్టోబర్‌ 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలను సంబంధిత ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2021 మార్చి 31కి ముందు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించనుంది. ఈ ఉత్తర్వుల జారీకి ముందే ఎవరైనా ఉద్యోగులు మరణిస్తే వారి చట్టబద్ధ వారసులకు నగదు రూపంలో డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. 2004 సెప్టెంబర్‌ 1 తర్వాత నియామకమై, కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) వర్తించే ఉద్యోగులకు, 2019 జూలై 1 నుంచి 2020 అక్టోబర్‌ 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిల్లో 10 శాతాన్ని వారి ప్రాణ్‌ ఖాతాల్లో జమ చేస్తారు. మిగిలిన 90 శాతం డీఏ బకాయిలను డిసెంబర్‌ నుంచి నాలుగు సమవాయిదాల్లో ప్రభుత్వం చెల్లించనుంది. పెన్షనర్లకు సంబంధించిన డీఏ బకాయిలను సైతం నాలుగు సమ వాయిదాల్లో 2020 డిసెంబర్‌ నుంచి చెల్లించనున్నారు. జీపీఎఫ్‌కు అనర్హులైన ఫుల్‌టైమ్‌ కాంటిజెంట్‌ ఉద్యోగుల డీఏ బకాయిలను డిసెంబర్‌లో చెల్లించనున్న వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లించనుంది.  

మరిన్ని వార్తలు