1,663 కొలువుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

3 Jul, 2022 02:50 IST|Sakshi

టీఎస్‌పీఎస్సీకి నియామకాల బాధ్యతలు 

తాజా పోస్టుల్లో 90 శాతం ఉద్యోగాలు ఇంజనీరింగ్‌ కేటగిరీవే 

ఐ–క్యాడ్‌లో 1,326, ట్రాన్స్‌పోర్ట్‌–ఆర్‌అండ్‌బీలో 284, ఆర్థిక శాఖలో 53 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ చదివిన నిరుద్యోగులకు శుభవార్త. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీని వేగవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 1,663 కొలువుల నియామకాలకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా భర్తీకి అనుమతులిచ్చిన పోస్టుల్లో 90 శాతం కొలువులు ఇంజనీరింగ్‌ కేటగిరీకి సంబంధించినవే.

ఇరిగేషన్‌ అండ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ (ఐ–క్యాడ్‌), ట్రాన్స్‌పోర్ట్‌–ఆర్‌అండ్‌బీ, ఆర్థిక శాఖల పరిధిలోని ఈ ఖాళీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం అనుమతిచ్చిన పోస్టుల్లో ఐ–క్యాడ్‌కు సంబంధించి 1,326 ఉద్యోగాలు, ట్రాన్స్‌పోర్ట్‌–ఆర్‌అండ్‌ బీ శాఖకు సంబంధించి 284 ఉద్యోగాలు, ఆర్థిక శాఖకు సంబంధించి 53 ఉద్యోగాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన అనుమతులతో కలిపి ఇప్పటివరకు 46,988 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లైంది.

ఇందులో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 9,526 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా, రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు ద్వారా 18,279 ఉద్యోగాలు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 10,028 ఉద్యోగాలు, జిల్లా నియామకాల కమిటీ ద్వారా 59, తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 9,096 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. వీటిలో పోలీసు, గ్రూప్‌–1, మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా.. మిగతా పోస్టులకు సంబంధించి ప్రకటనలు వెలువడాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు