పాత పద్ధతిలోనే ఆస్తుల రిజిస్ట్రేషన్లు

20 Dec, 2020 01:31 IST|Sakshi

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ 

రేపట్నుంచి ‘కార్డ్‌’ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు

హైకోర్టు తీర్పుపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నేటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కొంతకాలంపాటు పాత పద్ధతిలోనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నుంచి స్లాట్‌ బుకింగ్‌తో నిమిత్తం లేకుండా పాత (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌–కార్డ్‌) పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలన్న సీఎం కేసీఆర్‌ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఈ నెల 11 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల విధానంలో కొత్త పద్ధతి తీసుకొచ్చాం. ఈ విధానంలో ఉన్న అనుకూలతల కారణంగా రిజిస్ట్రేషన్ల పద్ధతిలో పారదర్శకత పెరిగింది. ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆన్‌లైన్‌లోనే స్లాట్‌ బుక్‌ చేసుకొనే వీలు కల్పించాం. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 2,599 స్లాట్లు బుక్‌ అవగా, 1,760 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ కోసం సేల్, మార్టిగేజ్, గిఫ్ట్, డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్లు, జీపీఏ తదితర 23 రకాల లావాదేవీలను అందుబాటులోకి తెచ్చాం. ఇంకో 5 రకాల సర్వీసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

ఈ నెల 16న బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాం. బ్యాంకర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 17న బిల్డర్లు, డెవలపర్లతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో చేపట్టిన వర్క్‌షాప్‌లోనూ సానుకూల అభిప్రాయం వ్యక్తమైంది. అయితే స్లాట్‌ బుకింగ్‌లను నిలిపివేయాలని, రిజిస్ట్రేషన్లు చేసే క్రమంలో ఆధార్‌ వివరాలు అడగొద్దని ఈ నెల 17న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని కొంతకాలంపాటు నిలిపివేస్తున్నాం. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 21 నుంచి అడ్వాన్స్‌డ్‌ స్లాట్‌ బుకింగ్‌ లేకుండానే పాత పద్ధతిలో అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇందుకోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి త్వరితగతిన రిజిస్ట్రేషన్లు చేయాలి’అని శనివారం సాయంత్రం ఇచ్చిన ఉత్తర్వుల్లో సీఎస్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో సందేహాల నివృత్తి కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను సంప్రదించాలని సీఎస్‌ సూచించారు. 18005994788 టోల్‌ఫ్రీ నంబర్‌కుగానీ, 9121220272 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారాగానీ లేదా  జటజ్ఛీఠ్చిnఛ్ఛి– జీజటటఃజీజటట. ్ట్ఛ ్చnజ్చn్చ. జౌఠి. జీn ను ఈ–మెయిల్‌ ద్వారా సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు.

ఇప్పటికే స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని ఉంటే...
సోమవారం నుంచి కార్డ్‌ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించిన సీఎస్‌... ఇప్పటికే ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి తాజా విధానం ద్వారానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్లాట్లు ఏ సమయానికి బుక్‌ చేసుకున్నారో ఆ సమయానికి రిజిస్ట్రేషన్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను శనివారం ఉదయం నుంచే ప్రభుత్వం నిలిపివేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్లాట్‌ బుకింగ్‌ సౌకర్యాన్ని కొంతకాలం నిలిపివేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో అధికారికంగా వెల్లడించింది. దీంతో కొత్త స్లాట్‌ల బుకింగ్‌ శనివారం ఉదయం నుంచే ఆగిపోయింది. అయితే రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో శుక్రవారం వరకు బుక్‌ అయిన స్లాట్‌లకు శనివారం రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజలు గందరగోళానికి గురికావద్దని, గతంలో బుక్‌ చేసుకున్న స్లాట్‌ ప్రకారం సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్లవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సుప్రీంకు వెళ్లే యోచన...!
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకొనేందుకు శనివారమే ఉన్నతాధికారులతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్‌ భావించినా అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం ఆదివారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే విషయాన్ని ఆదివారం జరిగే భేటీ అనంతరం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఈ కోణంలోనే హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ ప్రభుత్వం పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు మొగ్గు చూపిందని, హైకోర్టు ఆదేశాలను ఎందుకు పాటించలేదని సుప్రీంకోర్టు తప్పుబట్టకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది.

సర్క్యులర్‌ జారీ చేసిన రిజిస్ట్రేషన్ల ఐజీ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆ శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వి.శేషాద్రి రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అంతర్గత సర్క్యులర్‌ జారీ చేశారు. స్లాట్‌ బుకింగ్‌తో అవసరం లేకుండా, ఆధార్‌ వివరాలతో నిమిత్తం లేకుండా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సోమవారం నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే ప్రారంభించాలని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ యథాతథం
పాత పద్ధతిలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధన వర్తిస్తుందా లేదా అన్న దానిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధన విషయంలో మినహాయింపు లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ఎల్‌ఆర్‌ఎస్‌ లేని స్థలాలకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 26న ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేస్తూ సెప్టెంబర్‌ 8న ఆదేశాలు వచ్చాయి. అంటే సెప్టెంబర్‌ 8 వరకు అమల్లో ఉన్న నిబంధనలు పాటించాల్సిందే. ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే వరకు ఆగస్టు 26న వచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయి’అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే పాత పద్ధతి అమల్లో ఉన్నప్పుడు 6 నెలల క్రితం వరకు తీసిన చలాన్లు చెల్లుబాటు అవుతాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు