తెలుగుగంగ, వెలిగొండ విస్తరణను అడ్డుకోండి

6 Aug, 2021 03:54 IST|Sakshi

కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వం అక్రమంగా తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల విస్తరణ చేపట్టిందని, వాటిని అడ్డుకోవాలని కృష్ణా బోర్డుకు రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్టులను చేపట్టారని, ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ గురువారం కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. తెలుగుగంగ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా కుందూ నది నుంచి 8 టీఎంసీలు ఎత్తిపోసేలా కడప జిల్లా దువ్వూరు మండలం జొన్నవరంలో ఎత్తిపోతల పథకం చేపట్టారని, దానికి రూ.564.6 కోట్లు కేటాయిస్తూ అనుమతులు ఇచ్చారని లేఖలో వివరించారు.

వాస్తవానికి చెన్నై నగరానికి తాగునీటి కోసం తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారని, తర్వాత ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా మార్చారని తెలిపారు. అంతేగాకుండా శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ, గాలేరు– నగరి ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటిని తీసుకొని పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 88వేల క్యూసెక్కులు తరలించేలా గ్రావిటీ కాల్వల పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు గంగ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు ఇవ్వాల్సి ఉందని.. ఏటా పోతిరెడ్డిపాడు ద్వారా 179 టీఎంసీలు తరలిస్తూ చెన్నైకి 10 టీఎంసీలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.

ఇక శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకునే పేరిట వెలిగొండ టన్నెల్‌ ప్రాజెక్టు చేపట్టారని, రిజర్వాయర్‌లో 875 అడుగులపైన నీటిమట్టం ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకునేలా ఏపీని కట్టడి చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఏపీ చేపట్టిన ఈ ప్రాజెక్టులతో శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ ఆయకట్టు అవసరాలు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు